Rahul Gandhi: రాహుల్ గాంధీ 'ఓటు చోరీ' వ్యాఖ్యలు... సిట్ విచారణ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం.

Rahul Gandhi Vote Theft Allegations Supreme Court Dismisses SIT Petition
  • రాహుల్ 'ఓటు చోరీ' ఆరోపణలపై సిట్ విచారణకు నో
  • సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం
  • రాజకీయ వివాదాలకు కోర్టులు వేదిక కాదని స్పష్టీకరణ
  • ప్రత్యామ్నాయ వేదికలను ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచన
  • 'ఓటు చోర్ - గద్దీ ఛోడ్' అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల దుమారం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన 'ఓటు చోరీ' ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరిపించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. ఇది రాజకీయ స్వభావం ఉన్న అంశమని, దీని కోసం న్యాయస్థానాలను వేదిక చేసుకోరాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కొట్టివేసింది.

ఇటీవల రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర'లో మాట్లాడుతూ బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. 'ఓటు చోర్ - గద్దీ ఛోడ్' అనే నినాదంతో, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం దొంగిలించిన ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ, ఈసీ కలిసి ఓట్లు దొంగిలించాయని, త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తారని అన్నారు. "కొందరు పారిశ్రామికవేత్తల కోసం ప్రజల ఓటు హక్కును దొంగిలించాలని చూస్తున్నారు. బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీకి గురికాకుండా చూస్తాం" అని రాహుల్ వ్యాఖ్యానించారు.

రాహుల్ చేసిన ఈ ఆరోపణలపై సిట్ విచారణ జరపాలని కోరుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

అయితే, ఈ వాదనలను ధర్మాసనం పరిగణనలోకి తీసుకోలేదు. "ఇలాంటి రాజకీయ అంశాల కోసం కోర్టులను వేదికగా మార్చవద్దు. మీకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఎన్నికల సంఘం వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించండి" అని పిటిషనర్‌కు స్పష్టంగా సూచించింది. కాగా, రాహుల్ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు, ఎన్నికల సంఘం అధికారులు అప్పుడే తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.
Rahul Gandhi
Supreme Court
Vote theft allegations
SIT investigation
Election Commission
BJP
Bihar elections
Voter rights
Political allegations
Public Interest Litigation

More Telugu News