Shubman Gill: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు టీమిండియా ఎంపిక... రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ నియామకం

Shubman Gill Named Captain for Australia ODI Series
  • ఆసీస్ తో ఈ నెల 19 నుంచి వన్డే సిరీస్
  • భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వన్డే జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లు
  • కొత్త కెప్టెన్ గా గిల్... ఇప్పటికే టెస్టు సారథిగా వ్యవహరిస్తున్న వైనం
  • రోహిత్ శర్మ, కోహ్లీలకు వన్డే జట్టులో చోటు
  • తొలిసారిగా భారత వన్డే టీమ్ కు ఎంపికైన తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి
  • అక్టోబరు 29 నుంచి టీ20 సిరీస్
ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్, టీ20 సిరీస్ ల కోసం కోసం నేడు టీమిండియా జట్లను  ప్రకటించారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని వన్డే జట్టును ప్రకటించినట్టు అర్థమవుతోంది. రోహిత్ శర్మ స్థానంలో భారత వన్డే కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ ను నియమించారు. గిల్ ఇప్పటికే టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

కాగా, ఇప్పటికే టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు వన్డే జట్టులో స్థానం కల్పించారు. వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ ను నియమించారు. ఆంధ్రా క్రికెట్ స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి తొలిసారిగా భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతడిని ఆల్ రౌండర్ కోటాలో తీసుకున్నట్టు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యాకు ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ మేరకు నేడు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలో సమావేశమైన టీమిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. 

ఆసీస్ తో 3 వన్డేల సిరీస్ ఈ నెల 19 నుంచి జరగనుంది. ఆసీస్ తో వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు స్థానం లభించలేదు. అతడిని టీ20 సిరీస్ కు మాత్రం ఎంపిక చేశారు. ఇక, ఇటీవల కాలంలో పరుగుల వరద పారిస్తున్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మను వన్డే టీమ్ కు ఎంపిక చేస్తారని భావించినా, సెలెక్టర్లు ఆ దిశగా మొగ్గు చూపలేదు. ఆసీస్ పై కేవలం టీ20 సిరీస్ కు మాత్రమే అతడిని ఎంపిక చేశారు. ఆసీస్ తో టీ20 సిరీస్ అక్టోబరు 29 నుంచి జరగనుంది. ప్రస్తుతం విండీస్ తో టెస్టు సిరీస్ ముగిశాక టీమిండియా వన్డే, టీ20 సిరీస్ ల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.

భారత వన్డే జట్టు...
శుభ్ మన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

భారత టీ20 జట్టు...
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వరుణ్ చక్రవర్తి, జస్ ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా. 
Shubman Gill
India vs Australia
ODI Series
Team India
Rohit Sharma
Shreyas Iyer
Nitish Kumar Reddy
Cricket
Indian Cricket Team
Ajit Agarkar

More Telugu News