Vangalapudi Anitha: ఇవ్వని హామీ కూడా అమలు చేశాం: హోంమంత్రి అనిత

Vangalapudi Anitha Implementing Promises and Supporting Auto Drivers
  • ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం
  • ఉచిత బస్సు ప్రయాణ నష్టాల భర్తీకి కొత్త పథకం
  • విజయనగరంలో పథకాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత
  • జిల్లాలో రూ. 3.38 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
  • ఆటోలో ప్రయాణించి, ఖాకీ చొక్కా ధరించిన మంత్రి
  • ఎన్నికల హామీ కాకపోయినా అమలు చేస్తున్నట్లు వెల్లడి
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించే 'ఆటోడ్రైవర్ల సేవలో' పథకాన్ని ఏపీ కూటమి ప్రభుత్వం నేడు ప్రారంభించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో స్పందించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడమే కాకుండా, ఇవ్వని హామీ కూడా అమలు చేసి ఆటోడ్రైవర్లను ఆదుకుంటున్నామని చెప్పారు.

"గత ఏడాదిన్నరగా పేదల సేవలో తరిస్తున్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం... ఇప్పుడు ఆటో డ్రైవర్లకు ఇవ్వని హామీని కూడా అమలు చేసి వారి కష్టాలు తీరుస్తోంది. రాష్ట్రంలో మహిళకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల ఆటోడ్రైవర్లు నష్టపోతారన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టారు. 

ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలుతో ప్రజల చేత సూపర్ హిట్ అనిపించుకుంటున్న ప్రభుత్వం... ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా ఆటోడ్రైవర్లకు సేవలో పథకాన్ని అమలు చేస్తోంది. విజయనగరంలో నిర్వహించిన 'ఆటోడ్రైవర్ల సేవలో' కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఆటోడ్రైవర్ల కోసం విడుదల చేసిన రూ.3 కోట్ల 38 లక్షల 70 వేల రూపాయల చెక్కును ఆటోడ్రైవర్లకు అందించడం జరిగింది. 

అంతకుముందు విజయనగరం జిల్లా పరిషత్ అతిధి గృహం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ఆటోలో ప్రయాణించాను. కష్టానికి, శ్రామికశక్తికి ప్రతిరూపమైన ఖాకీ షర్ట్ వేసుకోవడం గౌరవంగా అనిపించింది. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్విని, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ వర్మ, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పాల్గొన్నారు" అని అనిత తన పోస్టులో వివరించారు.
Vangalapudi Anitha
Andhra Pradesh
AP government
Auto drivers scheme
Chandrababu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Free bus travel
Financial assistance
Vizianagaram

More Telugu News