శ్రద్ధా శ్రీనాథ్ కి కథానాయికగా తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లో మంచి గుర్తింపు ఉంది. 'జెర్సీ'తో తెలుగులో మంచి హిట్ అందుకున్న శ్రద్ధా, ఆ తరువాత వెంకటేశ్ మూవీలోను కనిపించింది. తొలిసారిగా ఆమె తమిళంలో ఒక వెబ్ సిరీస్ చేసింది .. దాని పేరే ' ది గేమ్'. ఏడు ఎపిసోడ్స్ గా ఈ నెల 2వ తేదీ నుంచి ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: కావ్య (శ్రద్ధా శ్రీనాథ్) ఒక సంస్థలో గేమ్ డెవలపర్ గా పనిచేస్తూ ఉంటుంది. అదే సంస్థలో పనిచేస్తున్న అనూప్ (సంతోష్ ప్రతాప్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కొన్ని కారాణాల వలన కావ్య తన అక్కయ్య కూతురు 'తార' బాధ్యతను కూడా తానే తీసుకుంటుంది. కావ్య మంచి తెలివైనది మాత్రమే కాదు .. ధైర్యవంతురాలు కూడా. గేమ్ డెవలపర్ గా ఆమె సాధించిన విజయాలకు ప్రశంసలు దక్కుతాయి. ఆమెను గురించిన కథనాలు పత్రికలు కూడా ప్రచురిస్తాయి.

అలాంటి కావ్యపై కొంతమంది ముసుగు వ్యక్తులు దాడి చేస్తారు.ఆ గాయాల నుంచి ఆమె కోలుకోవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఈ లోగా సోషల్ మీడియా ద్వారా కూడా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఆ ముసుగు వ్యక్తులు ప్రయత్నిస్తారు. తన గురించి అందరూ గుసగుసలు మాట్లాడుకోవడం ఆమెకి చాలా బాధను కలిగిస్తుంది. ఈ విషయం ఆమెకి .. అనూప్ కి మధ్య అగాధాన్ని కూడా సృష్టిస్తాయి. ఇద్దరో విడిపోయే పరిస్థితి వస్తుంది. 

ఇలాంటి పరిస్థితులలోనే గతంలో గౌతమ్ అనే వ్యక్తితో కావ్య సన్నిహితంగా ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంటుంది. అదే సమయంలో కావ్య అక్కయ్య కూతురు 'తార',  దేవ్ అనే ఒక యువకుడి ట్రాప్ లో పడుతుంది. ఆ యువకుడు 'తార'ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెడతాడు. తనకి సంబంధించిన సమస్యలలో నుంచి తాను బయటపడటం కోసం, 'తార'ను కాపాడుకోవడం కోసం కావ్య ఏం చేస్తుంది? ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ. 

విశ్లేషణ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం .. అది స్మార్ట్ ఫోన్ రూపంలో చేతిలోకి రావడం ఒక రకంగా ఉపయోగకరమైన విషయమే అయినా, మరో వైపున అనేక రకాల అనర్థాలకు అది దారితీస్తోంది. స్మార్ట్ ఫోన్ .. సోషల్ మీడియాపై ఫ్లాట్ ఫామ్స్ అందుబాటిలోకి వచ్చిన తరువాత వ్యక్తిగత వివరాలు భద్రపరచడం అసాధ్యంగా మారుతోంది. కురుమ పరువు ప్రతిష్ఠలను కాపాడుకోవడం కష్టమవుతోంది. 

ఎవరినైనా మానసికంగా వేధించడానికి ఇంతకుమించిన సాధనం లేదు అన్నట్టుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. ఒక విషయాన్ని లక్షల మందిలోకి తీసుకుని వెళ్లడానికి కొన్ని సెకన్లు కూడా పట్టడం లేదు. ఇలా అన్ని కోణాలలో నుంచి జరుగుతున్న దాడులకు సంబంధించి అల్లుకున్న కథ ఇది. వృత్తి పరంగా .. వ్యక్తిగతంగా ఇలాంటి ఒక పరిస్థితి ఒక స్త్రీకి ఎదురైతే ఎలా ఉంటుందనేది చెప్పడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు.

అయితే ఇలాంటి ఒక కథా నేపథ్యాన్ని ఎంచుకున్నప్పుడు బలమైన ఎమోషన్స్ అవసరమవుతాయి. బలమైన ఎమోషన్స్ రావాలంటే, అంతే బలంగా కుటుంబ బంధాలను .. అనుబంధాలను టచ్ చేయవలసి ఉంటుంది. కానీ ఆ వైపు నుంచి పెద్దగా ప్రయత్నాలు జరగలేదు. ఎక్కువగా జాబ్ .. ఆఫీస్ అంటూ ఒకే వాతావారణంలో కథను ఎక్కువ సేపు తిప్పారు. పైగా అందరికీ తెలిసిన కథనే మరోసారి చెప్పారు. అందువలన నిర్మాణ పరమైన విలువలు .. టేకింగ్ బాగానే ఉన్నప్పటికీ, రొటీన్ గానే అనిపిస్తుంది. 

పనితీరు: దర్శకుడు తాను ఎంచుకున్న కథను నీట్ గానే చెప్పాడు. అయితే అందుకు తీసుకున్న సమయం ఎక్కువ.  ఉన్న సమయంలో సన్నివేశాలలో గాఢత లోపించడం .. ఎమోషన్ పాళ్లు తగ్గడం కూడా ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాకపోవడానికి కారణమైంది. నేరస్థులు .. బాధితుల విషయం అలా ఉంచితే, పోలీస్ డిపార్టుమెంటువారి తీరు స్టేజ్ డ్రామాను గుర్తుచేస్తుంది. 

శ్రద్ధా శ్రీనాథ్ మంచి ఆర్టిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఆమె పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా అంత  కరెక్టుగా అనిపించదు. కథ బాగా ఉన్నప్పుడే పాత్రలు పండుతాయి . పాత్రలు బలంగా ఉంటేనే సన్నివేశాలు పండుతాయి అనే విషయాన్ని మరిచిపోకూడదు. అఖిలేశ్ ఫొటోగ్రఫీ .. సైమన్ కింగ్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. మణిమారన్ ఎడిటింగ్ విషయానికొస్తే, మరింత షార్ప్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది.

ముగింపు:  తెలిసిన కథనే మళ్లీ చెప్పాలనుకోవడం .. కథనాన్ని నిదానంగా నడిపించడం .. కథలో ఎమోషన్స్ కి పెద్దగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడం కారణంగా, ఈ సిరీస్ సాదాసీదాగా అనిపిస్తుందంతే.