Vaibhav Suryavanshi: రికార్డులతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు

Vaibhav Suryavanshi Smashes Record Fastest Century in Australia Youth Test
  • భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత
  •  ఆస్ట్రేలియాతో యూత్ టెస్టులో కేవలం 78 బంతుల్లోనే సెంచరీ
  •  ఆసీస్ గడ్డపై యూత్ టెస్టులో ఇదే అత్యంత వేగవంతమైన శతకం
  •  14 ఏళ్లకే ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర
  •  అండర్-19 టెస్టుల్లో రెండు వేగవంతమైన సెంచరీలు చేసిన మెకల్లమ్ రికార్డు సమం
  •  సిక్సర్లు, ఫోర్లతో ఆసీస్ బౌలర్లపై వైభవ్ పూర్తి ఆధిపత్యం
 ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న యూత్ టెస్టులో భారత అండర్-19 ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీతో చరిత్ర సృష్టించాడు. నేడు మ్యాచ్ రెండో రోజు ఆటలో కేవలం 78 బంతుల్లోనే శతకం బాది ఆస్ట్రేలియాలో యూత్ టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

బ్రిస్బేన్‌లోని ఇయాన్ హీలీ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనతను వైభవ్ అందుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 243 పరుగులకు కట్టడి చేసిన భారత జట్టు, ఆ తర్వాత తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్, ఆసీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో విరుచుకుపడి, మొత్తం 86 బంతుల్లో 113 పరుగులు చేసి ఔటయ్యాడు. ఒక సిక్స్, ఫోర్ వరుసగా బాది తన సెంచరీని పూర్తి చేసుకోవడం విశేషం.

ఈ సెంచరీతో వైభవ్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. యూత్ టెస్ట్ చరిత్రలోనే ఇది రెండో వేగవంతమైన సెంచరీ కాగా, భారత కెప్టెన్ ఆయుష్ మాత్రే (64 బంతుల్లో) అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో ఇంగ్లండ్‌పై ఆసీస్ ఆటగాడు లియామ్ బ్లాక్‌ఫోర్డ్ 124 బంతుల్లో చేసిన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అంతేకాకుండా, 14 సంవత్సరాల 188 రోజుల వయసులో ఆస్ట్రేలియాలో యూత్ టెస్ట్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా వైభవ్ చరిత్ర సృష్టించాడు.

అండర్-19 టెస్టుల్లో 100 కంటే తక్కువ బంతుల్లో రెండుసార్లు సెంచరీలు సాధించిన న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ రికార్డును కూడా వైభవ్ సమం చేశాడు. ఈ ఏడాది జులైలోనే ఇంగ్లండ్‌లో జరిగిన మ్యాచ్‌లో 15 ఏళ్లలోపు వయసులో ఒకే యూత్ టెస్టులో హాఫ్ సెంచరీ చేసి, వికెట్ పడగొట్టిన తొలి ఆటగాడిగా వైభవ్ నిలిచిన సంగతి తెలిసిందే.
Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi century
India Under 19
Youth Test Australia
Fastest century
Ayush Matre
Brendon McCullum
Cricket records
Ian Healy Oval

More Telugu News