Addanki Dayakar: రేవంత్ రెడ్డి దమ్మున్న మగాడు కాబట్టే కేసీఆర్ ను ఫామ్‌హౌస్‌కు పంపాడు: అద్దంకి దయాకర్

Addanki Dayakar slams KTR over party defections
  • పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఘాటు స్పందన
  • పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ చేర్చుకోలేదా అని ప్రశ్న
  • మీరు సుద్దులు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఒక వీడియో ప్రకటన ద్వారా గట్టిగా బదులిచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేళ్లలో 39 మంది ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను చేర్చుకున్నారని, అప్పుడు కేటీఆర్ నైతికత ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. "మీరు 39 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్సీలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నప్పుడు నీ మొహం ఎటుపోయింది?" అని దయాకర్ నిలదీశారు.

అంతకుముందు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉందని, అభివృద్ధి పేరుతో వారు ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అద్దంకి దయాకర్ స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మగాడని, దమ్మున్న నాయకుడు కాబట్టే బీఆర్ఎస్‌ను ఎన్నికల్లో ఓడించి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కు పంపించారని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని దయాకర్ ఆరోపించారు. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో సుద్దులు, నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరని ఆయన హితవు పలికారు. ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ నేతలకు లేదని దయాకర్ స్పష్టం చేశారు. 
Addanki Dayakar
Revanth Reddy
KTR
KCR
BRS
Congress
Telangana Politics
Party defections
Telangana Elections
Farmhouse

More Telugu News