Chandrababu Naidu: అమరావతిలో తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Reviews NTR Smriti Vanam Project in Amaravati
  • తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళలు ఉట్టిపడేలా ప్రాజెక్టు
  • అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష
  • ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు
తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కలగలిపి తెలుగు వైభవంగా అమరావతిలో నిర్మించే ఎన్టీఆర్ స్మృతివనం ప్రాజెక్టును చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, ప్రాచీన చరిత్ర తదితర అంశాలకు పెద్దపీట వేస్తూ దీనిని చేపట్టాలని సూచించారు. తన క్యాంపు కార్యాలయంలో నిన్న ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై సీఎం సమీక్షించారు. అమరావతిలోని నీరుకొండ వద్ద చేపట్టనున్న ఈ ప్రాజెక్టులోని అంశాలను అధికారులు సీఎంకు వివరించారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రాచీన తెలుగు చరిత్రతో పాటు ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు, పొట్టి శ్రీరాములు లాంటి విశిష్ట వ్యక్తుల విగ్రహాలు, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, లిపికి చెందిన వివరాలను కూడా తెలియచెప్పేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తెలుగు ప్రజల ప్రతీకగా ప్రజా రాజధాని అమరావతిని కూడా ప్రతిబింబించేలా ప్రాజెక్టు చేపట్టాలన్నారు.

182 మీటర్ల ఎత్తైన ఎన్టీఆర్ విగ్రహ స్మృతి వనం ప్రాజెక్టుకు అనుబంధంగా నీరుకొండ రిజర్వాయర్‌ను తీర్చిదిద్దాలన్నారు. ప్రత్యేకించి పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శించేందుకు అనువుగా ఆకర్షణల్ని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. గుజరాత్‌లో నిర్మించిన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును కూడా పరిశీలించాలని సీఎం పేర్కొన్నారు. అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణా నదిపై చేపట్టనున్న ఐకానిక్ వంతెన డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు. అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంతకముందు ఎన్టీఆర్ విగ్రహ నమూనాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. 
Chandrababu Naidu
NTR Smriti Vanam
Amaravati
Telugu Culture
Telugu Heritage
NTR Statue
Neerukonda
Statue of Unity
Andhra Pradesh
Tourism

More Telugu News