Sai Durga Tej: నా కాలేజీ గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి పోయింది... కారణం ఇదే: సాయి దుర్గ తేజ్

Sai Durga Tej on Social Media Abuse and Relationship Breakup
  • పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయాలన్న సాయి దుర్గ తేజ్
  • అసభ్యకర కామెంట్లపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన హీరో
  • స్టేజీపైనే తనపై వచ్చిన బూతులను చదివించి ఆవేదన
  • మీడియాలో వచ్చిన పెళ్లి వార్తల వల్లే తన బ్రేకప్ అయిందంటూ వెల్లడి
  • కాలేజీ గర్ల్‌ఫ్రెండ్ తనను వదిలేసిందని భావోద్వేగం
సోషల్ మీడియా వాడకంపై, అందులో వస్తున్న అసభ్యకర కామెంట్లపై ప్రముఖ సినీ నటుడు సాయి దుర్గ తేజ్ తీవ్రంగా స్పందించారు. పిల్లలు వాడే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ఖాతాలకు తప్పనిసరిగా ఆధార్ నంబర్ లేదా తల్లిదండ్రుల ఫోన్ నంబర్‌ను అనుసంధానం చేయాలని ఆయన కీలక సూచన చేశారు. ఇలా చేయడం వల్ల ఆన్‌లైన్‌లో ఇతరులను దూషించాలంటే పిల్లల్లో, వారి తల్లిదండ్రుల్లో భయం, బాధ్యత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.

‘అభయం మాన్‌సూన్-25’ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సాయి దుర్గ తేజ్, సోషల్ మీడియా వల్ల తను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పంచుకున్నారు. "నా ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను, నా కుటుంబాన్ని దారుణంగా తిడుతూ కామెంట్లు పెడుతుంటారు. నేను పెద్దవాడిని కాబట్టి వాటిని తట్టుకోగలను. కానీ, ఇదే పరిస్థితి చిన్న పిల్లలకు ఎదురైతే వారు ఎలా అర్థం చేసుకుంటారు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ సమస్య తీవ్రతను తెలియజేసేందుకు, తనపై వచ్చిన కొన్ని బూతు కామెంట్లను స్టేజీపైనే ఇతరుల చేత చదివించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఇదే కార్యక్రమంలో తన వ్యక్తిగత జీవితం గురించి కూడా సాయి దుర్గ తేజ్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాలో తన పెళ్లి గురించి వచ్చిన విపరీతమైన ప్రచారాల వల్లే తన ప్రేమ విఫలమైందని సంచలన విషయం బయటపెట్టారు. "నా పెళ్లి ఫలానా అమ్మాయితో, ఫలానా వారితో అంటూ మీడియా చేసిన రచ్చ చూసి నా కాలేజీ గర్ల్‌ఫ్రెండ్ నన్ను వదిలేసి వెళ్లిపోయింది. అది చాలా బాధాకరమైన బ్రేకప్" అని అన్నారు. పెళ్లి విషయంలో మీడియా కాస్త ప్రశాంతంగా ఉంటే, సమయం వచ్చినప్పుడు ఆ శుభవార్తను తానే స్వయంగా ప్రకటిస్తానని తేజ్ స్పష్టం చేశారు.
Sai Durga Tej
Sai Tej
social media
cyber abuse
online harassment
internet safety
college girlfriend
relationship breakup
celebrity marriage rumors
Abhayam Monsoon 25

More Telugu News