Junk Food: నాలుగు రోజులు జంక్ ఫుడ్ తింటే.. మెదడుకు ఎంత ప్రమాదమో తెలుసా?

Just 4 days of junk food can mess up your memory cognitive skills says Study
  • కొవ్వు పదార్థాలతో నాలుగే రోజుల్లో జ్ఞాపకశక్తికి ముప్పు
  • ఊబకాయం, మధుమేహం కంటే ముందే మెదడుపై ప్రభావం
  • మెదడులోని ప్రత్యేక కణాలు అతిగా చురుగ్గా మారడమే కారణం
  • మెదడుకు గ్లూకోజ్ సరఫరా తగ్గడంతోనే ఈ సమస్య
  • ఆహారపు అలవాట్లతో నష్టాన్ని సరిదిద్దవచ్చన్న పరిశోధకులు
  • యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా అధ్యయనంలో వెల్లడి
చీజ్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి ఇష్టంగా లాగించేస్తున్నారా? అయితే, మీకో హెచ్చరిక. ఇలాంటి కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని కేవలం నాలుగు రోజులపాటు తిన్నా చాలు, అది మీ మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ తాజా అధ్యయనం తేల్చిచెప్పింది. ఊబకాయం లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు మొదలుకాకముందే, ఈ జంక్ ఫుడ్ నేరుగా మెదడు పనితీరును దెబ్బతీయడం ఆందోళన కలిగించే విషయం.

అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (యూఎన్‌సీ) పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'న్యూరాన్' సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధిక కొవ్వు ఉన్న ఆహారం తిన్నప్పుడు, మెదడులోని జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోక్యాంపస్ ప్రాంతంలో ఉండే 'సీసీకే ఇంటర్‌న్యూరాన్లు' అనే ప్రత్యేక కణాలు అతిగా చురుగ్గా మారుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు అందాల్సిన గ్లూకోజ్ (చక్కెర) సరఫరాలో లోపం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణమని తేలింది. ఈ కణాల అతి చురుకుదనం వల్ల జ్ఞాపకశక్తి ప్రక్రియ దెబ్బతింటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జువాన్ సాంగ్ వివరించారు.

"ఆహారం, జీవక్రియలు మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని మాకు తెలుసు. కానీ ఇంత తక్కువ సమయంలోనే మెదడులోని ఒక ప్రత్యేక కణాల సమూహంపై ఇంత తీవ్ర ప్రభావం పడుతుందని ఊహించలేదు. గ్లూకోజ్ కొరతకు ఈ కణాలు ఇంత వేగంగా స్పందించి, జ్ఞాపకశక్తిని దెబ్బతీయడం మమ్మల్ని ఆశ్చర్యపరిచింది" అని జువాన్ సాంగ్ తెలిపారు.

పరిశోధకులు ఎలుకలపై ఈ ప్రయోగాలు నిర్వహించారు. కేవలం నాలుగు రోజులు అధిక కొవ్వు ఆహారం అందించిన వెంటనే వాటి మెదడులో ఈ మార్పులను గమనించారు. అయితే, ఓ శుభవార్త కూడా ఈ అధ్యయనం అందించింది. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం లేదా అడపాదడపా ఉపవాసం వంటి పద్ధతుల ద్వారా ఈ సమస్యను సరిదిద్దవచ్చని తేలింది. మెదడుకు గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురావడం ద్వారా అతిగా స్పందిస్తున్న న్యూరాన్లను శాంతపరిచి, ఎలుకలలో జ్ఞాపకశక్తి సమస్యలను పరిష్కరించగలిగినట్లు పరిశోధకులు వెల్లడించారు.
Junk Food
Juan Song
memory loss
brain health
glucose
University of North Carolina
CCK interneurons
hippocampus
obesity
diet

More Telugu News