Karnataka: పరిహారం కోసం దారుణం.. భర్తను చంపి పులిపైకి నెట్టేసిన భార్య!

Karnataka woman kills husband blames tiger attack to claim compensation
  • భర్తను హత్య చేసి పులిపై నెపం వేసిన భార్య
  • రూ.15 లక్షల ప్రభుత్వ పరిహారం కోసమే ఈ ఘాతుకం
  • ఇంటి వెనక పేడకుప్పలో భర్త శవం లభ్యం
  • ఆహారంలో విషం పెట్టి చంపినట్లు అంగీకరించిన నిందితురాలు
  • కర్ణాటకలోని మైసూరు జిల్లాలో ఘటన
వన్యప్రాణుల దాడిలో ఎవరైనా మరణిస్తే ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. పులి దాడి చేసిందంటూ ఓ కట్టుకథ అల్లింది. కానీ, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడటంతో ఆమె ప్లాన్ విఫలమైంది. ఈ దిగ్భ్రాంతికర ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది.

పోలీసుల కథనం ప్రకారం, హుణసూరు తాలూకా పరిధిలోని చిక్కహెజ్జూరు గ్రామానికి చెందిన వెంకటస్వామి (45), సల్లాపురి దంపతులు. వీరు పోక తోటల్లో కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సోమవారం నాడు వీరి గ్రామంలో పులి సంచరిస్తున్నట్లు పుకార్లు వ్యాపించాయి. ఇదే అదనుగా భావించిన సల్లాపురి, తన భర్తను హత్య చేసి పరిహారం పొందాలని పథకం రచించింది.

ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం, తన భర్త కనిపించడం లేదని, పులి దాడి చేసి లాక్కెళ్లిపోయి ఉండవచ్చని ఆమె అందరినీ నమ్మించింది. దీంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. వర్షం పడుతుండటంతో వారికి పులి అడుగుజాడలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు, ఆమె ఇంటి పరిసరాల్లోనే వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇంటి వెనుక ఉన్న పేడకుప్పలో వెంకటస్వామి మృతదేహాన్ని గుర్తించారు.

మృతదేహం దొరకడంతో పోలీసులు సల్లాపురిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజం అంగీకరించింది. వన్యప్రాణుల దాడిలో చనిపోతే ప్రభుత్వం రూ. 15 లక్షలు పరిహారంగా ఇస్తుందని పోక తోటలో పనిచేస్తున్నప్పుడు ఎవరో మాట్లాడుకోగా విన్నానని, ఆ డబ్బు కోసమే ఈ హత్య చేసినట్లు ఆమె ఒప్పుకుంది. ఆహారంలో విషం కలిపి చంపేశాక, శవాన్ని పేడకుప్పలో దాచినట్లు వివరించింది. ఈ ఘటనపై హుణసూరు గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Karnataka
Sallapuri
husband killed
tiger attack hoax
Mysore district
wildlife compensation
crime news
poison murder
Hunasuru
fake story

More Telugu News