Chiranjeevi: భార్యను చూడగానే డ్యాన్స్ మరిచిపోయిన చిరు.. అసలు విషయం చెప్పిన కూతురు సుష్మిత

Chiranjeevi Forgot Dance Seeing Wife Says Sushmita
  • భార్యను చూసి కంగారుపడ్డ మెగాస్టార్ చిరంజీవి
  • సాంగ్ షూటింగ్‌లో స్టెప్పులు మరిచిపోయిన వైనం
  • తండ్రి గురించి ఆసక్తికర విషయం చెప్పిన కూతురు 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుష్మిత వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవికి తన భార్య సురేఖ అంటే ఎంత ఇష్టమో, అంత కాస్త భయం కూడా ఉందని ఆయన కుమార్తె సుస్మిత కొణిదెల సరదాగా వ్యాఖ్యానించారు. భార్యను చూడగానే చిరంజీవి ఏకంగా డ్యాన్స్ స్టెప్పులే మరిచిపోయారని ఆమె చెప్పిన ఓ ఆసక్తికర సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. నిర్మాత సాహు గారపాటి, సుస్మిత కొణిదెల కలిసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరోపక్క సాహు గారపాటి నిర్మాణంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘కిష్కిందపురి’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుస్మితను యాంకర్ సుమ.. "నాన్నకు అమ్మ అంటే కొంచెమైనా భయం ఉంటుందా?" అని అడిగారు.

దీనికి సుస్మిత నవ్వుతూ సమాధానమిచ్చారు. "ఈరోజే భయపడ్డారు. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ జరుగుతుండగా, అమ్మ షూటింగ్ చూడటానికి వచ్చారు. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన నాన్న, అమ్మను చూసిన వెంటనే కంగారుపడిపోయారు. ఒక్కసారిగా స్టెప్పులు మరిచిపోయి తడబడ్డారు" అని సుస్మిత చెప్పడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. తండ్రి గురించి సుస్మిత పంచుకున్న ఈ సరదా విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

Chiranjeevi
Chiranjeevi Surekha
Sushmita Konidela
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Kishkindhapuri Movie
Telugu Cinema
Tollywood
Dance Steps
Pre Release Event

More Telugu News