Mallikarjun Kharge: జీఎస్టీపై మోదీ సర్కార్ 'కుంభకర్ణ నిద్ర' వీడింది: ఖర్గే వ్యంగ్యాస్త్రాలు

Woke up after eight years Mallikarjun Kharge slams Modi govt over delayed GST reforms
  • 8 ఏళ్ల తర్వాత జీఎస్టీపై మోదీ సర్కార్ మేల్కొంద‌న్న ఖర్గే
  • తాము తెస్తే వ్యతిరేకించి ఇప్పుడు సంబరాలు చేసుకుంటున్నారని విమ‌ర్శ‌
  • 'ఒకే దేశం, ఒకే పన్ను'ను 'ఒకే దేశం, 9 పన్నులు'గా మార్చారంటూ ఫైర్‌
  • సామాన్యులపై భారం మోపిన 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' ఇదేనని మండిపాటు
  • రాష్ట్రాలకు ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని డిమాండ్
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణల విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి ఎనిమిదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జ్ఞానోదయం కలిగిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం 'కుంభకర్ణ నిద్ర' వీడి మేల్కొనడం మంచి విషయమేనంటూ ఆయన గురువారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జీఎస్టీ కౌన్సిల్ ఇటీవల పన్ను స్లాబులలో కీలక మార్పులు చేసిన నేపథ్యంలో ఆయన 'ఎక్స్‌' వేదికగా స్పందించారు.

గత దశాబ్ద కాలంగా జీఎస్టీని సరళీకరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూనే ఉందని ఖర్గే గుర్తుచేశారు. "మోదీ ప్రభుత్వం 'ఒకే దేశం, ఒకే పన్ను' అనే నినాదాన్ని 'ఒకే దేశం, 9 పన్నులు'గా మార్చేసింది. 0%, 5%, 12%, 18%, 28% స్లాబులతో పాటు 0.25%, 1.5%, 3%, 6% ప్రత్యేక రేట్లను ప్రవేశపెట్టి గందరగోళం సృష్టించింది" అని ఆయన విమర్శించారు. సరళమైన పన్నుల విధానంతో 'జీఎస్టీ 2.0'ను తాము 2019, 2024 మేనిఫెస్టోలలోనే ప్రతిపాదించామని తెలిపారు.

ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీనే జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారని ఖర్గే ఆరోపించారు. "2011లో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ అడ్డుపడింది. కానీ ఇవాళ అదే బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయని సంబరాలు చేసుకుంటోంది. సామాన్యుల నుంచి పన్నులు వసూలు చేయడం గొప్ప ఘనత అన్నట్లుగా వ్యవహరిస్తోంది" అని ఆయన దుయ్యబట్టారు.

ఈ ప్రభుత్వం పాలు, పెరుగు, పిండి, ధాన్యాలతో పాటు వ్యవసాయ రంగానికి చెందిన 36 వస్తువులపై జీఎస్టీ విధించిందని, అందుకే తాము దీనిని 'గబ్బర్ సింగ్ ట్యాక్స్' అని పిలుస్తున్నామని ఖర్గే అన్నారు. వసూలవుతున్న మొత్తం జీఎస్టీలో 64 శాతం పేద, మధ్యతరగతి ప్రజల నుంచే వస్తోందని, కానీ కేవలం 3 శాతం మాత్రమే కుబేరుల నుంచి వస్తోందని ఆయన ఆరోపించారు.

తాజాగా చేపట్టిన సంస్కరణల వల్ల రాష్ట్రాలు ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నందున, 2024-25ను ఆధార సంవత్సరంగా తీసుకుని ఐదేళ్లపాటు పూర్తి పరిహారం చెల్లించాలని ఖర్గే డిమాండ్ చేశారు. అలాగే, సంక్లిష్టమైన జీఎస్టీ నిబంధనలను తొలగిస్తేనే చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిజమైన ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


Mallikarjun Kharge
GST
Goods and Services Tax
Modi government
Congress party
tax slabs
Indian economy
finance
tax reforms
Pranab Mukherjee

More Telugu News