Amit Mishra: టీమిండియా వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా రిటైర్మెంట్

Veteran leg spinner Amit Mishra announces retirement from all forms of cricket
  • 25 ఏళ్ల తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు
  • తరచూ గాయాలు, యువతకు అవకాశాలు ఇవ్వాలనే ఈ నిర్ణయం
  • ఐపీఎల్ లో మూడు హ్యాట్రిక్ లు సాధించిన ఏకైక బౌలర్ గా రికార్డు
  • భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ రంగాల్లోకి అడుగుపెడతానని వెల్లడి
భారత వెటరన్ లెగ్ స్పిన్నర్, ఐపీఎల్ లో హ్యాట్రిక్ ల రారాజుగా పేరుగాంచిన అమిత్ మిశ్రా తన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేశాడు. తరచూ గాయాల బారిన పడుతుండటం, తర్వాతి తరం ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా మిశ్రా మాట్లాడుతూ, "క్రికెట్ లో నా ఈ 25 ఏళ్ల ప్రయాణం ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్, సహాయక సిబ్బంది, సహచరులు, నా కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎక్కడ ఆడినా నన్ను ఎంతగానో ఆదరించిన అభిమానుల ప్రేమ, మద్దతును ఎప్పటికీ మరిచిపోలేను. క్రికెట్ నాకు అన్నీ ఇచ్చింది. మైదానంలో గడిపిన ప్రతీ క్షణం నా జీవితాంతం గుర్తుండిపోతుంది" అని తెలిపాడు. 

ఇక‌, భవిష్యత్తులో కోచింగ్, కామెంటరీ, యువ క్రికెటర్లకు మెంటార్ గా వ్యవహరిస్తూ ఆటకు దగ్గరగా ఉండాలనుకుంటున్నట్లు మిశ్రా తన ప్రకటనలో పేర్కొన్నాడు.

టీమిండియా త‌ర‌ఫున మిశ్రా గ‌ణాంకాలు ఇలా..
2003లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన అమిత్ మిశ్రా, భారత్ తరఫున 22 టెస్టుల్లో 76 వికెట్లు, 36 వన్డేల్లో 64 వికెట్లు, 10 టీ20ల్లో 16 వికెట్లు పడగొట్టాడు. 2008లో ఆస్ట్రేలియాపై మొహాలీలో ఆడిన తన అరంగేట్రం టెస్టులోనే ఐదు వికెట్ల ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 2013లో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ లో 18 వికెట్లు తీసి, ఒక ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన జవగళ్ శ్రీనాథ్ ప్రపంచ రికార్డును సమం చేశాడు.

ఐపీఎల్ లోనే మిశ్రాకు విశేషమైన గుర్తింపు
అంతర్జాతీయ క్రికెట్ కంటే ఐపీఎల్ లోనే మిశ్రాకు విశేషమైన గుర్తింపు లభించింది. ఐపీఎల్ చరిత్రలో మూడు వేర్వేరు జట్ల తరఫున మూడు హ్యాట్రిక్ లు సాధించిన ఏకైక బౌలర్ గా అరుదైన రికార్డు సృష్టించాడు. 2008లో ఢిల్లీ డేర్ డెవిల్స్, 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, 2013లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ ఘనత సాధించాడు. ఐపీఎల్ లో మొత్తం 162 మ్యాచ్ లు ఆడి 174 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. 2024 ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాజస్థాన్ రాయల్స్ తో ఆడిన మ్యాచే అమిత్ మిశ్రాకు చివరి ప్రొఫెషనల్ మ్యాచ్.
Amit Mishra
Amit Mishra retirement
Indian cricketer
IPL
Indian Premier League
leg spinner
cricket retirement
BCCI
Haryana Cricket Association
Lucknow Super Giants

More Telugu News