Asif Ali: అంతర్జాతీయ క్రికెట్‌కు పాక్ పవర్ హిట్టర్ వీడ్కోలు

Asif Ali Announces Retirement From International Cricket
  • అంతర్జాతీయ క్రికెట్‌కు ఆసిఫ్ అలీ రిటైర్మెంట్
  • పాకిస్థాన్ మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలు
  • సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటన
  • పవర్ హిట్టర్, ఫినిషర్‌గా మంచి గుర్తింపు
  • భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌పై ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లు ప్రత్యేకం
పాకిస్థాన్ క్రికెట్ జట్టులో పవర్ హిట్టర్‌గా, ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న మిడిలార్డర్ బ్యాటర్ ఆసిఫ్ అలీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 33 ఏళ్ల ఆసిఫ్, తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని నిన్న‌ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అయితే, ప్రపంచవ్యాప్తంగా జరిగే దేశవాళీ, ఫ్రాంచైజీ లీగ్‌లలో మాత్రం తాను ఆడటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు.

ఈ సందర్భంగా ఆసిఫ్ అలీ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. "ఈ రోజు నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. పాకిస్థాన్ జెర్సీ ధరించడం నా జీవితంలో లభించిన గొప్ప గౌరవం. నా దేశం కోసం క్రికెట్ మైదానంలో సేవ చేయడం గర్వంగా భావిస్తున్నాను. ఎంతో కృతజ్ఞతతో రిటైర్ అవుతున్నా. దేశవాళీ, లీగ్ క్రికెట్ ఆడుతూ ఆటపై నా ఇష్టాన్ని పంచుకోవడం కొనసాగిస్తాను" అని రాసుకొచ్చాడు.

2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆసిఫ్ అలీ, తన కెరీర్‌లో 21 వన్డేలు, 58 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ రెండు ఫార్మాట్లలో కలిపి మొత్తం 959 పరుగులు సాధించాడు. ముఖ్యంగా తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. వన్డేలలో 121.65, టీ20లలో 133.87 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేయడం అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యానికి నిదర్శనం.

ఆసిఫ్ అలీ కెరీర్‌లో కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. 2021 టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌కు 12 బంతుల్లో 24 పరుగులు అవసరమైన దశలో కరీం జనత్ వేసిన ఓవర్లో ఏకంగా నాలుగు సిక్సర్లు బాది కేవలం 7 బంతుల్లోనే 25 పరుగులు చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. అలాగే 2022 ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం 8 బంతుల్లో 16 పరుగులు చేసి పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ఫైనల్‌లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ఇస్లామాబాద్ యునైటెడ్‌ను గెలిపించిన తర్వాత ఆసిఫ్ అలీ వెలుగులోకి వచ్చాడు. ఆ ప్రదర్శనతోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. సరైన అవకాశాలు రాకపోవడంతో అతని ప్రతిభకు పూర్తి న్యాయం జరగలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరిగిన మ్యాచే పాకిస్థాన్ తరఫున అతను ఆడిన చివరి ప్రధాన మ్యాచ్.
Asif Ali
Pakistan Cricket
Cricket Retirement
Power Hitter
PSL
T20 World Cup
Asia Cup
Islamabad United
Pakistan Super League

More Telugu News