Harmeet Singh Dhillon: పోలీసులపై కాల్పులు జరిపి ఎమ్మెల్యే పరార్

Harmeet Singh Dhillon MLA Fled After Firing at Police
  • పంజాబ్ లో ఎమ్మెల్యే హర్మీత్‌ సింగ్‌ ధిల్లాన్‌ పై రేప్ కేసు
  • జిరాక్ పూర్ మహిళ ఆరోపణలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు
  • రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారంటున్న ఎమ్మెల్యే హర్మీత్
అత్యాచారం కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆపై కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. మంగళవారం ఉదయం కర్నాల్‌ లో హర్మీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులపై హర్మీత్, ఆయన మద్దతుదారులు కాల్పులు జరిపారు. అనంతరం అనుచరులతో కలిసి హర్మీత్ అక్కడి నుంచి పారిపోయారు. ప్రస్తుతం హర్మీత్, ఆయన అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. పటియాలాలోని సనూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ ధిల్లాన్ పై జిరాక్‌ పూర్‌ కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే తనను మోసం చేశాడని, విడాకులయ్యాయని చెప్పి తనకు దగ్గరయ్యాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోవాలని కోరితే బెదిరింపులకు దిగాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యే హర్మీత్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్నాల్ లో హర్మీత్ సింగ్ ను అరెస్టు చేసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌ కు తరలిస్తుండగా.. హర్మీత్‌, ఆయన సహాయకులు అధికారులపై కాల్పులు జరిపారు.

హర్మీత్ సింగ్ ఏమంటున్నారంటే..?
తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే హర్మీత్‌ సింగ్ ఖండించారు. రాజకీయ కుట్రతోనే తనపై కేసు నమోదైందని ఫేస్ బుక్ లైవ్ లో పేర్కొన్నారు. ఆప్‌ ప్రభుత్వంపైనా ఆయన విమర్శలు చేశారు. ఢిల్లీలోని ఆప్ అధిష్ఠానం పంజాబ్ లో పాలన సాగిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై అక్రమంగా కేసు పెట్టారని హర్మీత్ సింగ్ ఆరోపించారు.
Harmeet Singh Dhillon
Punjab AAP MLA
rape case
police firing
absconding
Karnal
political conspiracy
Punjab floods
Aam Aadmi Party

More Telugu News