YS Sharmila: అన్నమయ్య... ఇక అంతేనయ్య!: షర్మిల

YS Sharmila slams AP govt over Annamayya project delay
  • గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి సర్కారుపై షర్మిల ఫైర్
  • అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదేళ్లయినా పట్టించుకోలేదని విమర్శలు
  • జగన్ రూ.800 కోట్లతో, చంద్రబాబు రూ.340 కోట్లతో హామీలిచ్చి మోసం చేశారని ఆరోపణ
అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం విషయంలో గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండూ ఘోరంగా విఫలమయ్యాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రాజెక్టు కొట్టుకుపోయి ఐదేళ్లు గడిచినా, 39 మందిని బలిగొన్న ఆ ఘోర విపత్తు బాధితుల జీవితాలు ఇంకా కన్నీళ్లలోనే మగ్గుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అన్నమయ్య ప్రాజెక్టు 'అనాథ ప్రాజెక్టు'గా మారిపోయిందని ఆమె అన్నారు.

"అన్నమయ్య..ఇక అంతేనయ్య. ప్రాజెక్ట్ కొట్టుకు పోయి 5 ఏళ్లు దాటినా పునర్ నిర్మాణానికి దిక్కులేదు. 39 మందిని బలిగొన్న ఘోర విపత్తులో జరిగిన నష్టాన్ని పూడ్చే మనసు ప్రభుత్వాలకు లేదు. 5 ఊళ్లు కొట్టుకుపోతే పునరావాసానికి రూపాయి ఇచ్చింది లేదు. సర్వం కోల్పోయిన నిరాశ్రయులను నేటికి ఆదుకున్నది లేదు. గత ముఖ్యమంత్రి జగన్  గారు రూ.800 కోట్లతో మరమ్మతులు అంటూ హడావిడి చేయడం తప్ప ప్రాజెక్ట్ ను కట్టింది లేదు. పునరుద్ధరణ పేరుతో 3 ఏళ్లు గడిపారే తప్ప... తట్టెడు మట్టి వేయలేదు. బాధిత కుటుంబాలకు ఇళ్లు అందలేదు. చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు దక్కలేదు. ఇసుక మాఫియాతో ప్రాజెక్టుకు గండి పడితే అసెంబ్లీ వేదికగా హై లెవెల్ కమిటీలనీ, దర్యాప్తు కొనసాగిస్తామని కాలయాపన తప్ప జగన్ గారు ఉద్ధరించింది శూన్యం. 

అధికారంలో వచ్చిన ఏడాదిలో ప్రాజెక్ట్ కడతామని చెప్పి చంద్రబాబు గారు చేస్తుంది కూడా మోసమే. రాజంపేటకు రెండుసార్లు వచ్చిపోయారు కానీ, ప్రాజెక్ట్ పనులకు మోక్షం లేదు. రూ.340 కోట్లతో మరమ్మతులు అని చెప్పి రూపాయి కూడా ఇవ్వలేదు. డ్యామ్ నిర్మాణం కోసం సర్వేల పేరుతో బాబు గారు సైతం కాలయాపన చేస్తున్నారు. రాజంపేట వేదికగా మళ్లీ మాయమాటలు చెప్పారు తప్పిస్తే ప్రాజెక్ట్ నిర్మాణంపై దిశా - నిర్దేశం లేకపోవడం శోచనీయం. 

కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమిప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నమయ్య కన్నీటి వ్యధకు శాశ్వత పరిష్కారం చూపాలి. గత 5 ఏళ్లుగా నీటి నిల్వ లేక 30 వేల ఎకరాలకు సాగునీరు పారడం లేదు. లక్షమందికి త్రాగునీరు అందడం లేదు. వెంటనే పూర్తి స్థాయి నిధులు కేటాయించి అన్నమయ్య ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని, డ్యామ్ ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హామీల మేరకు పూర్తి స్థాయి జరగాలని డిమాండ్ చేస్తున్నాం" అని షర్మిల స్పష్టం చేశారు. 
YS Sharmila
Annamayya project
Andhra Pradesh
YSR Congress
Chandrababu Naidu
irrigation project
Rajampet
floods
project failure
AP Congress

More Telugu News