Branco Test: క్రికెటర్ల సత్తాకు కొత్త కొలమానం.. బీసీసీఐ తెచ్చిన 'బ్రాంకో టెస్ట్' ప్రత్యేకతలివే!

Branco Test Details BCCIs New Fitness Assessment for Cricketers
  • భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ కొత్త ఫిట్‌నెస్ టెస్ట్
  • 'బ్రాంకో టెస్ట్' పేరుతో సరికొత్త విధానం
  • ఆటగాళ్ల వేగం, గుండె సామర్థ్యానికి అసలు సిసలు పరీక్ష
  • 1200 మీటర్ల పరుగును వేగంగా పూర్తి చేయాలి
  • యో-యో టెస్టులా కాకుండా విరామం లేని పరుగు
భారత పురుషుల క్రికెట్ జట్టులో చోటు దక్కించుకోవాలనుకునే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు బీసీసీఐ సరికొత్త ఫిట్‌నెస్ టెస్ట్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ప్రామాణికంగా ఉన్న యో-యో టెస్టుకు భిన్నంగా, 'బ్రాంకో టెస్ట్' పేరుతో ఈ నూతన పరీక్షను ప‌రిచ‌యం చేసింది. ఆటగాళ్ల గుండె పనితీరు సామర్థ్యాన్ని, వేగాన్ని, అలసట నుంచి కోలుకునే శక్తిని ఇది పరీక్షిస్తుంది.

ఏమిటీ బ్రాంకో టెస్ట్? ఎలా నిర్వహిస్తారు?
బ్రాంకో టెస్ట్ అనేది అత్యంత వేగంతో నిరంతరాయంగా పరుగెత్తే ఒక కఠినమైన పరీక్ష. రగ్బీ వంటి క్రీడల్లో ఎప్పటినుంచో ఉన్న ఈ విధానాన్ని ఇప్పుడు భారత క్రికెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ టెస్టులో భాగంగా, స్టార్టింగ్ లైన్ నుంచి 20 మీటర్లు, 40 మీటర్లు, 60 మీటర్ల దూరంలో మూడు మార్కర్లను ఏర్పాటు చేస్తారు.

ఆటగాడు స్టార్టింగ్ లైన్ నుంచి మొదలుపెట్టి, ముందుగా 20 మీటర్ల మార్కర్‌ను తాకి వెనక్కి రావాలి. ఆ తర్వాత 40 మీటర్ల మార్కర్‌ను, చివరగా 60 మీటర్ల మార్కర్‌ను తాకి తిరిగి స్టార్టింగ్ లైన్‌కు చేరుకోవాలి. ఇలా మూడు షటిల్ రన్‌లు పూర్తి చేస్తే ఒక సెట్ పూర్తవుతుంది. ఒక సెట్‌లో ఆటగాడు మొత్తం 240 మీటర్ల దూరం పరుగెత్తుతాడు. ఈ పరీక్షలో భాగంగా మొత్తం 5 సెట్లు పూర్తి చేయాలి. అంటే, సుమారు 1200 మీటర్ల దూరాన్ని ఎంత తక్కువ సమయంలో పూర్తి చేశారన్న దాని ఆధారంగా ఆటగాడి ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తారు.

యో-యో టెస్టుకు, దీనికి తేడా ఏంటి?
ఇప్పటివరకు అందరికీ తెలిసిన యో-యో టెస్టులో ప్రతి షటిల్ రన్ తర్వాత కొద్దిగా విరామం లభిస్తుంది. కానీ, బ్రాంకో టెస్టులో ఎక్కడా విరామం ఉండదు. మొత్తం 1200 మీటర్ల దూరాన్ని నిరంతరాయంగా పరుగెత్తాల్సిందే. ఇది ఆటగాడి శారీరక సామర్థ్యాన్నే కాకుండా, మానసిక దృఢత్వాన్ని కూడా తీవ్రంగా పరీక్షిస్తుంది. మైదానంలో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తడం, ఫీల్డింగ్‌లో బంతిని వేగంగా వెంబడించి, వెంటనే వెనక్కి విసరడం వంటి సందర్భాల్లో అవసరమయ్యే ఫిట్‌నెస్‌ను ఈ టెస్ట్ క‌చ్చితంగా అంచనా వేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆధునిక క్రికెట్‌లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఆటగాళ్లలో అత్యున్నత ఫిట్‌నెస్ ప్రమాణాలను నెలకొల్పేందుకే బీసీసీఐ ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

Branco Test
BCCI
Indian Cricket Team
Yo-Yo Test
Fitness Test
Cricket Fitness
Team Selection
Physical Fitness
Sports Science
Athlete Performance

More Telugu News