Peter Navarro: భారత్ పై నోరు పారేసుకున్న పీటర్ నవారో

Peter Navarro Slams India as Russia Landromat
  • భారత్‌పై ట్రంప్ వాణిజ్య సలహాదారు నవారో తీవ్ర ఆరోపణలు
  • చౌకగా రష్యా చమురు కొని, లాభాలకు అమ్ముకుంటోందని విమర్శ
  • భారత్ చర్యలు రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని వ్యాఖ్య
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు చేశారు. రష్యాకు భారత్ ఒక 'లాండ్రోమ్యాట్‌' (దుస్తులు ఉతికే యంత్రం) గా మారిందని, మాస్కో నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి, శుద్ధి చేసి, అధిక లాభాలకు అమ్ముకుంటూ యుద్ధానికి పరోక్షంగా నిధులు సమకూరుస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

భారత్ చర్యల వల్ల రష్యా యుద్ధ యంత్రాంగానికి ఇంధనం అందుతోందని నవారో ఆరోపించారు. "భారత్ రష్యాకు ఒక లాండ్రోమ్యాట్‌ తప్ప మరొకటి కాదు. మీరు భారతీయ ప్రజల ఖర్చుతో బ్రాహ్మణులను లాభపడేలా చేశారు. మనం దానిని ఆపాలి" అని నవారో అన్నారు. భారతీయ శుద్ధి కర్మాగారాలు డిస్కౌంట్ పొందిన రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి, ప్రాసెస్ చేసి, అధిక ధరకు ఎగుమతి చేస్తున్నాయని ఆరోపించారు. భారత్ ఈ విధంగా రష్యా నుంచి చమురు కొని లాభాలకు అమ్ముకోవడం వల్ల ఉక్రెయిన్‌లో ప్రజలు చనిపోతున్నారని, ఆ దేశానికి సాయం చేసేందుకు అమెరికా పన్ను చెల్లింపుదారులు మరింత డబ్బు పంపాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్... రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో ఎందుకు అంటకాగుతోందో తనకు అర్థం కావడం లేదని నవారో వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ గొప్ప నాయకుడని అంటూనే, ఆయన విదేశాంగ విధానాన్ని ప్రశ్నించారు. ట్రంప్ హయాంలో భారత ఎగుమతులపై విధించిన దిగుమతి సుంకాలను ఆయన సమర్థించుకున్నారు. రష్యా, చైనాలతో భారత్ సంబంధాలు ప్రపంచ స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధాని మోదీ చైనాలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొంటున్న తరుణంలోనే నవారో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఏడేళ్ల తర్వాత భేటీ అయ్యారు. అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాస్కోతో భారత్ వాణిజ్య సంబంధాలపై అమెరికా నుంచి విమర్శలు రావడం గమనార్హం. 
Peter Navarro
Russia Ukraine war
India Russia trade
Russian oil imports
Narendra Modi
SCO summit
India US relations
Vladimir Putin
Xi Jinping

More Telugu News