Kaleshwaram Project: కాళేశ్వరంపై రగడ: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

Kaleshwaram Project Row BRS MLAs Walkout of Assembly
  • కాళేశ్వరం నివేదికపై చర్చలో తీవ్ర గందరగోళం
  • జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసిన బీఆర్ఎస్
  • మాట్లాడే అవకాశం ఇవ్వలేదంటూ సభ నుంచి వాకౌట్
  • బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
  • నివేదిక ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ
తెలంగాణ శాసనసభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

కాళేశ్వరం నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ సభ్యులు ఆరోపించారు. స్పీకర్ మైక్ ఇవ్వకపోవడంతో గంటన్నర పాటు వేచి చూశామని, అయినా అవకాశం రాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు ఘోష్ కమిషన్ నివేదిక ప్రతులను చించివేసి నిరసన తెలిపారు. సభ లాబీల్లో భారీ సంఖ్యలో మార్షల్స్‌ను మోహరించడంపై కూడా వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

అనంతరం ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సభ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారు తమ నిరసనను కొనసాగించారు.

బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. సభలో కాగితాలు చించివేయడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు. కాళేశ్వరం నివేదికలోని వాస్తవాలు ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకే బీఆర్ఎస్ ఇలా ప్రవర్తిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు సభా నియమాలను గౌరవించాలని ఆయన సూచించారు.
Kaleshwaram Project
Telangana Assembly
BRS MLAs
PC Ghosh Commission
Bhatti Vikramarka
Telangana Politics
Assembly Walkout
Telangana News
Political Protest

More Telugu News