Darsitha: వివాహిత యువతి నోట్లో బాంబు పెట్టి చంపిన ప్రియుడు!

Kerala Woman Darsitha Killed by Lover Siddharaju with Bomb
  • మైసూరు లాడ్జిలో మహిళ దారుణ హత్య
  • నోట్లో పేలుడు పదార్థం పెట్టి చంపిన ప్రియుడు సిద్ధరాజు
  • కేరళలో అత్తగారి ఇంట్లో భారీ దొంగతనం
  • చోరీ కేసులో అనుమానితురాలిగా ఉన్న మృతురాలు దర్శిత
  • దోచిన సొమ్ము పంపకాల వల్లే హత్య అని పోలీసుల అనుమానం
  • నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
కేరళలో అత్తగారింట్లో భారీ దొంగతనానికి పాల్పడి, ప్రియుడితో కలిసి పారిపోయిన ఓ మహిళ.. చివరకు ఆ ప్రియుడి చేతిలోనే కర్ణాటకలో దారుణ హత్యకు గురైంది. ప్రియుడు వివాహిత నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపడం సంచలనం సృష్టించింది. దోచుకున్న సొమ్ము పంపకాల విషయంలో తలెత్తిన వివాదమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు సిద్ధరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన దర్శిత (20) భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆమెకు బంధువైన సిద్ధరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల దర్శిత, తన అత్త కేసీ సుమత ఇంట్లో 30 సవర్ల బంగారం, రూ.4 లక్షల నగదు దొంగిలించి సిద్ధరాజుతో కలిసి కర్ణాటకకు పారిపోయింది. దొంగతనంపై ఫిర్యాదు అందుకున్న కేరళ పోలీసులు దర్శితను విచారించగా, తాను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి తప్పించుకుంది.

కర్ణాటకలోని మైసూరు జిల్లా, హున్సూర్ తాలూకా పరిధిలోని భేర్య గ్రామంలో ఉన్న ఓ లాడ్జిలో దర్శిత, సిద్ధరాజు గది అద్దెకు తీసుకున్నారు. అక్కడ దొంగిలించిన సొమ్మును పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సిద్ధరాజు, గనుల్లో ఉపయోగించే పేలుడు పదార్థాన్ని దర్శిత నోటిలో ఉంచి ట్రిగ్గర్‌తో పేల్చాడు. ఈ దాడిలో ఆమె ముఖం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 

మొబైల్ ఫోన్ పేలడం వల్లే ఆమె చనిపోయిందని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసిన సిద్ధరాజు, అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సాలిగ్రామ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేరళ దొంగతనం కేసుకు, ఈ హత్యకు సంబంధం ఉందని గుర్తించి రెండు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Darsitha
Kerala theft
Karnataka murder
Siddharaju arrest
love affair
crime news
gold robbery
bomb explosion
Mysore police
interstate investigation

More Telugu News