Asaduddin Owaisi: ప్రధానిని రాష్ట్రపతి తొలగించగలరా? .. నలుగురు మంత్రుల్ని అరెస్ట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతుంది: ఒవైసీ

Owaisi warns arrest of ministers can collapse state governments
  • ప్రధాని, సీఎంల తొలగింపు బిల్లుపై ఒవైసీ తీవ్ర అభ్యంతరం
  • దేశంలో పోలీసు రాజ్యం సృష్టించేందుకే ఈ ప్రయత్నమని విమర్శ
  • అరెస్టైన నేతలు బీజేపీలో చేరకుండా చట్టం చేయగలరా? అని సవాల్
ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్రపతికి నిజంగా ఉంటుందా? అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను పదవుల నుంచి తొలగించేందుకు కేంద్రం ప్రతిపాదిస్తున్న బిల్లులను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రిమండలి సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకోవాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోందని ఒవైసీ గుర్తుచేశారు. అలాంటప్పుడు, దానికి విరుద్ధంగా ప్రధానిని తొలగించే అధికారాన్ని రాష్ట్రపతికి ఎలా కట్టబెడతారని ఆయన నిలదీశారు. ఏ రాష్ట్రపతి అయినా ప్రధానమంత్రిని రాజీనామా చేయించగలరా? అని పీటీఐతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు.

ఈ బిల్లుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కూడా కేంద్రం హరిస్తుందని ఒవైసీ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఏ రాష్ట్రంలోనైనా నలుగురైదుగురు మంత్రులను అరెస్టు చేయగలదని, అలా జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వం సులభంగా కూలిపోతుందని ఆయన అన్నారు. "ఇక రాష్ట్రాలకు స్వేచ్ఛ ఎక్కడ ఉంటుంది? అంతా మీ నియంత్రణలోనే ఉంటుంది కదా" అని కేంద్రంపై మండిపడ్డారు.

ఈ బిల్లుల ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో పోలీసు రాజ్యాన్ని సృష్టించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. ఇది రాజ్యాంగంలోని అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అస్థిరపరిచే ప్రయత్నమని దుయ్యబట్టారు. బీజేపీకి నిజంగా నైతిక విలువలపై నమ్మకం ఉంటే, అరెస్ట్ అయిన నాయకులు తమ పార్టీలో చేరకుండా ఒక చట్టం తీసుకురావాలని ఆయన సవాల్ విసిరారు.
Asaduddin Owaisi
President of India
Prime Minister removal
State government collapse
Central government bills
Constitutional framework
Political criticism
Arrest of ministers
BJP government
Police state

More Telugu News