Chiranjeevi: 'పుష్ప' సినిమా స్పూర్తితో గంజాయి స్మగ్లింగ్ చేశాడు!

Chiranjeevi arrested for ganja smuggling inspired by Pushpa movie
  • పుష్ప సినిమా తరహాలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన నిందితుడు చిరంజీవి
  • సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఘటన 
  • ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు
సమాజంలో చోటుచేసుకుంటున్న నేరాల నేపథ్యంలో అనేక సినిమాలు రూపొందుతుండగా, కొందరు నేరస్థులు మాత్రం సినిమాల్లో చూపించిన నేర విధానాలను అనుసరించి నిజ జీవితంలో నేరాలకు పాల్పడుతున్నారు. పోలీసుల తనిఖీలను తప్పించుకునేందుకు 'పుష్ప' చిత్రంలో నిందితులు గంజాయి అక్రమ రవాణాకు కొత్త పద్ధతులను అవలంబిస్తారు.

ఈ సినిమా తరహాలోనే గంజాయిని తరలిస్తున్న ఒక నిందితుడిని సంగారెడ్డి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు చిరంజీవి అనే నిందితుడు 5.4 కిలోల ఎండు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు అతడిని పట్టుకున్నారు.

అతను ప్రయాణిస్తున్న కారులో డ్యాష్‌ బోర్డు, సీట్ల కింద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రహస్య క్యాబిన్లలో గంజాయిని దాచినట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతని కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని సంగారెడ్డి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం విచారణ కొనసాగుతోంది.
Chiranjeevi
Sangareddy
ganja smuggling
Pushpa movie
drug trafficking
marijuana
Telangana police
crime news
Maharashtra
Odisha

More Telugu News