Delhi High Court: రూ. 20 వాటర్ బాటిల్‌కు రూ. 100.. ఆపై సర్వీస్ ఛార్జ్: రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Restaurants Charging Rs 100 For Rs 20 Bottle High Court Raps Association
  • రెస్టారెంట్ల సర్వీస్ ఛార్జ్ వసూలుపై ఢిల్లీ హైకోర్టులో విచారణ
  • అధిక ధరలు తీసుకుంటూ మళ్లీ సర్వీస్ ఛార్జ్ ఎందుకని సూటి ప్రశ్న
  • రూ. 20 వాటర్ బాటిల్‌కు రూ. 100 ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీత
  • ఇది వినియోగదారులను బలవంతంగా దోచుకోవడమేనని కోర్టు వ్యాఖ్య
  • సర్వీస్ ఛార్జ్ వసూలు అన్యాయమైన వాణిజ్య విధానమని స్పష్టీకరణ
రెస్టారెంట్లు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జ్‌పై ఢిల్లీ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇప్పటికే ఆహార పదార్థాలపై ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు తీసుకుంటూ, మళ్లీ అదనంగా సర్వీస్ ఛార్జ్ ఎందుకు వసూలు చేస్తున్నారని రెస్టారెంట్ల సంఘాలను సూటిగా ప్రశ్నించింది. ఇది వినియోగదారులను రెట్టింపు దోపిడీకి గురి చేయడమేనని అభిప్రాయపడింది.

రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్‌ను తప్పనిసరిగా వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జాతీయ రెస్టారెంట్ల సంఘం (ఎన్ఆర్ఏఐ), భారత హోటళ్లు, రెస్టారెంట్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌హెచ్ఆర్ఏఐ) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాయి. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తుషార్ రావు గెడెలతో కూడిన ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది.

"మీరు కేవలం ఆహారం అమ్మడమే కాదు, కస్టమర్లకు మంచి అనుభూతిని (ఆంబియన్స్) కూడా అందిస్తున్నారు. దానికోసం ఇప్పటికే ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు, రూ. 20 విలువైన వాటర్ బాటిల్‌ను మెనూలో రూ. 100కి అమ్ముతున్నారు. ఆ అదనపు రూ. 80 ఆంబియన్స్ కోసమే కదా? అలాంటప్పుడు, మళ్లీ ప్రత్యేకంగా సర్వీస్ ఛార్జ్ ఎందుకు?" అని ధర్మాసనం ప్రశ్నించింది.

ఆంబియన్స్ అందించడం కూడా మీరు చేసే సేవలో భాగమేనని, దానికోసం ప్రత్యేకంగా ఛార్జ్ చేయడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. ఇలా సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడం వినియోగదారులను బలవంతపెట్టడమే అవుతుందని, ఇది ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, అన్యాయమైన వాణిజ్య పద్ధతి కిందకు వస్తుందని వ్యాఖ్యానించింది. వినియోగదారులు సర్వీస్ ఛార్జ్‌పై కూడా జీఎస్టీ చెల్లించాల్సి రావడం వల్ల వారిపై రెట్టింపు భారం పడుతోందని గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. ఈ వ్యవహారంలో తాము ప్రేక్షకపాత్ర వహించలేమని తేల్చి చెప్పింది.
Delhi High Court
Restaurant service charge
Service charge
NRAI
FHRAI
Restaurant pricing
MRP
Consumer rights
GST
unfair trade practice

More Telugu News