Sudarshan Reddy: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్ షా తీవ్ర వ్యాఖ్యలు

Amit Shah Criticizes Sudarshan Reddy
  • ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ వేడెక్కిన రాజకీయాలు
  • జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి మద్దతిచ్చారని అమిత్ షా తీవ్ర ఆరోపణ
  • ఆయన ఇచ్చిన సల్వా జుడుం తీర్పు వల్లే నక్సలిజం పెరిగిందని వెల్లడి
  • ఆ తీర్పు లేకపోతే 2020 నాటికే నక్సలిజం అంతమయ్యేదని వ్యాఖ్య
  • సుప్రీంకోర్టు వేదికను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని విమర్శ
ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన ఆరోపణలు చేశారు. సుదర్శన్ రెడ్డి తన తీర్పు ద్వారా నక్సలిజానికి పరోక్షంగా ఊతమిచ్చారని, ఆయన నక్సలిజం మద్దతుదారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం ఢిల్లీలో జరిగిన మనోరమ న్యూస్ కాన్‌క్లేవ్‌లో అమిత్ షా మాట్లాడుతూ, "జస్టిస్ సుదర్శన్ రెడ్డి నక్సలిజానికి సహకరించిన వ్యక్తి. ఆయన ఇచ్చిన సల్వా జుడుం తీర్పు వల్లే దేశంలో నక్సల్ ఉగ్రవాదం ఏళ్లపాటు కొనసాగింది. ఒకవేళ ఆ తీర్పు రాకపోయి ఉంటే, 2020 నాటికే నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టేవాళ్లం," అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలబెట్టిందని, సుప్రీంకోర్టు వంటి పవిత్రమైన వేదికను దుర్వినియోగం చేసిందని ఆయన విమర్శించారు.

ఏమిటీ సల్వా జుడుం తీర్పు?

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి 2005లో అప్పటి ప్రభుత్వం గిరిజన యువతతో ‘సల్వా జుడుం’ పేరుతో ఒక పౌర సైన్యాన్ని ఏర్పాటు చేసింది. వీరికి ఆయుధ శిక్షణ ఇచ్చి స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా నియమించింది. అయితే, ఈ దళంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం 2011లో చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పౌరులకు ఆయుధాలిచ్చి ప్రభుత్వమే హింసను ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ సల్వా జుడుంను రద్దు చేసింది.

కాగా, అధికార ఎన్డీఏ కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఆయన తమిళనాడుకు చెందిన సీనియర్ బీజేపీ నేత.
Sudarshan Reddy
Amit Shah
Vice President Election
Salwa Judum
Naxalism
India Coalition
Supreme Court
CP Radhakrishnan
BJP
Manorama News Conclave

More Telugu News