VP Shameer: కేరళలో యూఏఈ వ్యాపారి కిడ్నాప్ కథ సుఖాంతం.. సినీ ఫక్కీలో రక్షించిన పోలీసులు

Kerala Police Rescue UAE Businessman VP Shameer From Kidnappers
  • రూ. 1.5 కోట్ల కోసం కిడ్నాపర్ల డిమాండ్
  • సూత్రధారిగా తేలిన మాజీ ఉద్యోగి
  • వ్యాపారిని సురక్షితంగా కాపాడిన పోలీసులు
  • ప్రధాన నిందితుడితో పాటు ఆరుగురి అరెస్ట్
  • ఉద్యోగం నుంచి తీసేశాడన్న కక్షతోనే ఈ దారుణం
సొంత రాష్ట్రమైన కేరళకు సెలవుల కోసం వచ్చిన యూఏఈకి చెందిన భారత వ్యాపారి కిడ్నాప్ ఉదంతం సుఖాంతమైంది. ఆయన వద్ద గతంలో పనిచేసిన ఉద్యోగే ఈ కిడ్నాప్‌కు సూత్రధారి అని తేలింది. మలప్పురం, కొల్లాం పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి, కేవలం రెండు రోజుల్లోనే వ్యాపారిని సురక్షితంగా కాపాడి, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

యూఏఈలో ఫార్మసీ స్టోర్ల చైన్ నడుపుతున్న వీపీ షమీర్ (36) మంగళవారం సాయంత్రం తన బైక్‌పై ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మలప్పురంలో రాత్రి 7:45 గంటల సమయంలో కొందరు దుండగులు ఆయనను బలవంతంగా ఒక టయోటా ఇన్నోవా కారులోకి ఎక్కించుకుని అపహరించారు. ఆ తర్వాత, షమీర్ ఫోన్ నంబర్ నుంచే దుబాయ్‌లోని ఆయన బిజినెస్ పార్ట్‌నర్‌కు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. షమీర్‌ను విడిచిపెట్టాలంటే రూ. 1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులను ఆశ్రయించవద్దని ఆయన భార్యను కూడా బెదిరించారు.

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, లొకేషన్ ట్రాకింగ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కిడ్నాపర్ల కారు ఎర్నాకుళం వైపు వెళ్లినట్టు గుర్తించారు. వారికి కారు సమకూర్చిన వారిని ప్రశ్నించడంతో కీలక సమాచారం లభించింది. ఎర్నాకుళంలో షమీర్ ఫోన్ రెండుసార్లు ఆన్ అవ్వడం దర్యాప్తులో పోలీసులకు బాగా ఉపయోగపడింది.

మలప్పురం, కొల్లాం పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో నిన్న ఉదయం 11:30 గంటలకు కొల్లాం జిల్లా కురువిక్కోణంలో షమీర్‌ను గుర్తించారు. తమిళనాడుకు తరలించేందుకు కిడ్నాపర్లు ప్రయత్నిస్తుండగా ఒక కారులో ఉన్న ఆయనను పోలీసులు కాపాడారు. ఈ కిడ్నాప్‌తో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో సూత్రధారి పుతు వీట్టిల్ షంషీర్‌తో పాటు హంషీర్, ఫయాస్, అఫ్జల్, మహమ్మద్ నైఫ్, షాహీర్ ఉన్నారు.

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. షమీర్ వద్ద గతంలో పనిచేసిన షంషీర్ (30)ను ఉద్యోగం నుంచి తీసేయడంతో కక్ష పెంచుకున్నాడు. గతంలోనే బెదిరింపులకు పాల్పడిన అతడు, పక్కా ప్లాన్‌తో ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కిడ్నాప్ సమయంలో తనపై దాడి జరిగిందని షమీర్ చెప్పడంతో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.
VP Shameer
UAE businessman kidnap
Kerala kidnap case
Malappuram police
Kidnapping ransom
Kuruvikkonam
Puthu Veettil Shamseer
Ernakulam
Crime news India

More Telugu News