Shalu Mehra: బాంబు పేలినట్టు అనిపించింది.. జమ్మూకశ్మీర్ ఆకస్మిక వరదలను గుర్తుచేసుకున్న బాధితులు

Kishtwar Flash Floods Pilgrims Recall Horrific Incident
  • జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర ప్రమాదం
  • మచైల్ మాతా యాత్ర మార్గంలో విరుచుకుపడిన ఆకస్మిక వరదలు
  • వరదల్లో చిక్కుకుని 60 మంది యాత్రికులు దుర్మరణం
  • భక్తుల కోసం ఏర్పాటు చేసిన భోజనశాలపైకి దూసుకొచ్చిన వరద
  • శిథిలాల కింద చిక్కుకున్నామని కన్నీటిపర్యంతమైన బాధితులు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన
"ఏదో బాంబు పేలినట్టు పెద్ద శబ్దం వినిపించింది. 'పరుగెత్తండి, పరుగెత్తండి' అంటూ అందరూ ప్రాణభయంతో కేకలు పెట్టారు" అంటూ జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో జరిగిన ఘోర ప్రమాదాన్ని కన్నీళ్లతో వివరించారు షాలూ మెహ్రా అనే మహిళ. నిన్న మధ్యాహ్నం మచైల్ మాతా యాత్ర మార్గంలో ఆకస్మికంగా సంభవించిన వరద బీభత్సం నుంచి ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటనలో దాదాపు 60 మంది యాత్రికులు మరణించినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కిష్త్వార్ జిల్లాలోని చసోటి గ్రామం వద్ద యాత్రికులు పుణ్యక్షేత్రానికి ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో ఈ జల ప్రళయం సంభవించింది. వర్షం నుంచి తలదాచుకునేందుకు కొందరు, భోజనం చేసేందుకు మరికొందరు యాత్రికులు స్థానికంగా ఏర్పాటు చేసిన ఉచిత భోజనశాల (లంగర్)లో ఆశ్రయం పొందారు. ఇంతలో ఎవరూ ఊహించని విధంగా భారీ బండరాళ్లు, చెట్లతో కూడిన వరద ప్రవాహం ఒక్కసారిగా ఆ భోజనశాలను ముంచెత్తింది.

"అంతా క్షణాల్లో జరిగిపోయింది. ప్రవాహం దారిలో ఉన్న ప్రతీదాన్ని చదును చేసుకుంటూ వెళ్లిపోయింది. నేను శిథిలాల్లో చిక్కుకుపోగా, ఓ కరెంట్ స్తంభం నా తలపై పడింది. వెంటనే నా కూతురిని పిలిచాను. తనే నన్ను బయటకు లాగింది" అని షాలూ మెహ్రా ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. అక్కడి నుంచి బయటపడ్డాక, తనకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కుమారుడి కోసం వెతకడం ప్రారంభించినట్టు ఆమె చెప్పారు.

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన సంజయ్ కుమార్ అనే మరో భక్తుడు మాట్లాడుతూ "కొన్ని క్షణాల ముందే 15 మంది యాత్రికులు నాలుగు వాహనాల నుంచి కిందకు దిగారు. చూస్తుండగానే ఆ వాహనాలు ఆటబొమ్మల్లాగా బోల్తాపడి వరదలో కొట్టుకుపోయాయి. ఇలాంటిది జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు" అని అన్నారు. ఈ ఘటనలో సంజయ్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

భోజనశాల నిర్వాహకుడు సుభాష్ చందర్ గుప్తా మాట్లాడుతూ "అందరికీ భోజనం వడ్డిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద కేకలు వినిపించాయి. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. నేను ఓ పెద్ద బండరాయి కింద ఇరుక్కుపోయాను. దాదాపు మూడు గంటల పాటు అలాగే ఉండిపోయాను" అని ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకున్నారు. చసోటి గ్రామం నుంచే పుణ్యక్షేత్రానికి 8.5 కిలోమీటర్ల తుది యాత్ర ప్రారంభమవుతుంది. ఇక్కడే ఈ విషాదం చోటుచేసుకోవడంతో యాత్రికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Shalu Mehra
Jammu Kashmir floods
Machail Mata Yatra
Kishtwar flood
flash floods India
Chasoti village
Subhash Chander Gupta
pilgrims
natural disaster
India floods

More Telugu News