Perni Nani: చాలా పార్టీల్లో చంద్రబాబుకు బ్రోకర్లు ఉన్నారు: పేర్ని నాని

Perni Nani Alleges Chandrababu Has Brokers in Many Parties
  • పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు, లోకేశ్ చెరబట్టారన్న పేర్ని నాని
  • కలెక్టర్ ఎదుటే టీడీపీ దొంగ ఓట్లు వేసిందని ఆరోపణ
  • ఉప ఎన్నిక విజయంతో చంద్రబాబు సాధించింది ఏమిటని ప్రశ్న
పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేశ్ చెరబట్టారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబట్టారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఉప ఎన్నిక జరిపారని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. 

పులివెందులలో ప్రజస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలే నమ్మడం లేదని పేర్ని నాని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందులలో ఓటు వేశారని చెప్పారు. పులివెందులలో టీడీపీ నేతల అరాచకాలను ప్రజలంతా చూశారని అన్నారు. 

ఒక ప్లాన్ ప్రకారమే ఎన్నికల సంఘం రీపోలింగ్ పెట్టిందని ఆరోపించారు. సీసీ ఫుటేజ్, వెబ్ క్యాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయం ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇచ్చిన వీడియోల్లోనే దొంగ ఓటర్లు బయటపడ్డారని తెలిపారు. పోలింగ్ బూత్ ల వద్ద మహిళలు కనిపించలేదని చెప్పారు. ఈ జడ్పీటీసీ ఉప ఎన్నికల విజయంతో చంద్రబాబు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. 

పులివెందులలో టీడీపీ నేతలే వైసీపీకి ఓటు వేశారని పేర్ని నాని తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. చాలా పార్టీల్లో చంద్రబాబుకు బ్రోకర్లు ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల్లో బ్రోకర్లను పెట్టుకుని పనిచేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. కూటమిలో బీజేపీ, జనసేనలు డమ్మీ పార్టీలని ఎద్దేవా చేశారు. 
Perni Nani
Chandrababu Naidu
Pulivendula
AP Politics
YSRCP
TDP
Nara Lokesh
Andhra Pradesh Elections
ZPTC Elections
Allegations

More Telugu News