APSDMA: ఇవాళ కూడా అదే ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం

APSDMA warns of heavy rains in Andhra Pradesh due to low pressure
  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • రాబోయే 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనం
  • ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు
  • గుంటూరు, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వానలు
  • హెచ్చరికలు జారీ చేసిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో రానున్న రెండు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. ఇది రాబోయే 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీని ప్రభావంతో ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అదేవిధంగా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని ఏపీఎస్‌డీఎంఏ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
APSDMA
Andhra Pradesh rains
low pressure area
Bay of Bengal
coastal Andhra
heavy rainfall warning
weather forecast
IMD
Eluru
Visakhapatnam

More Telugu News