Donald Trump: మస్క్ ఏఐ 'గ్రోక్' వివాదాస్పద వ్యాఖ్య.. వాషింగ్టన్‌లో 'పేరుమోసిన నేరస్థుడు' ట్రంపేనట!

Elon Musks Grok Calls Donald Trump Most Notorious Criminal In Washington DC
  • వాషింగ్టన్‌లో ట్రంప్‌ను పెద్ద నేరస్థుడిగా పేర్కొన్న మస్క్ ఏఐ చాట్‌బాట్ గ్రోక్
  • 34 కేసుల్లో దోషిగా తేలడమే కారణమని పోస్టులో వెల్లడి
  • వివాదం తర్వాత గ్రోక్‌ను కొద్దిసేపు సస్పెండ్ చేసిన 'ఎక్స్'
  • ఇదొక చిన్న పొరపాటని కొట్టిపారేసిన ఎలాన్ మస్క్
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చాట్‌బాట్ 'గ్రోక్' చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వాషింగ్టన్ డీసీలోనే 'అత్యంత పేరుమోసిన నేరస్థుడు'గా అభివర్ణించి పెను దుమారానికి తెరలేపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చింది.

వివరాల్లోకి వెళితే.. వాషింగ్టన్‌లో నేరాల గురించి ఓ 'ఎక్స్' యూజర్ అడిగిన ప్రశ్నకు గ్రోక్ స్పందించింది. న్యూయార్క్‌లో నమోదైన 34 కేసుల్లో ట్రంప్ దోషిగా తేలారని, ఈ కారణంగానే ఆయన నగరంలో పెద్ద‌ నేరస్థుడని పేర్కొంది. ఆదివారం ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు, "వాషింగ్టన్ డీసీలో హింసాత్మక నేరాలు ఈ ఏడాది 26 శాతం తగ్గి, 30 ఏళ్ల కనిష్ఠానికి చేరాయి. ఇక నగరంలో అత్యంత పేరుమోసిన నేరస్థుడి విషయానికొస్తే.. శిక్షలు, పేరుప్రతిష్టల ఆధారంగా అది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే" అని గ్రోక్ జవాబిచ్చినట్లు న్యూస్‌వీక్ పేర్కొంది. అయితే, వివాదం చెలరేగడంతో ఈ పోస్టును తొలగించారు. 

వాషింగ్టన్‌లో నేరాలు అదుపు తప్పాయని, నగర పోలీసు వ్యవస్థను ఫెడరల్ పరిధిలోకి తెచ్చి, జాతీయ భద్రతా దళాలను మోహరిస్తామని ట్రంప్ ప్రకటించిన కొన్ని రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇక‌, ఇటీవల ట్రంప్, మస్క్ మధ్య బహిరంగంగానే విభేదాలు భ‌గ్గుమ‌న్న విష‌యం తెలిసిందే. ట్రంప్‌పై తాను చేసిన కొన్ని వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు మస్క్ తర్వాత తెలిపారు.

ఈ వివాదం తర్వాత గ్రోక్‌ను ఆదివారం 'ఎక్స్' ప్లాట్‌ఫామ్ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. తిరిగివచ్చాక దాని సస్పెన్షన్‌పై పరస్పర విరుద్ధమైన సందేశాలు ఇచ్చింది. ఒకసారి తనను సస్పెండ్ చేయలేదని, మరోసారి విద్వేషపూరిత వ్యాఖ్యల కారణంగా చర్యలు తీసుకున్నారని చెప్పింది. 

ఈ గందరగోళంపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. "ఇదొక చిన్న పొరపాటు" అని కొట్టిపారేశారు. 'ఎక్స్', ఎక్స్‌ఏఐ బృందాల మధ్య సమన్వయ లోపం వల్లే ఇలా జరిగిందని వివరించారు. గతంలో కూడా గ్రోక్ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది.
Donald Trump
Elon Musk
Grok AI
Washington DC
AI Chatbot
X platform
crime
controversy
artificial intelligence
US politics

More Telugu News