YS Avinash Reddy: పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు .. రెండు కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్

Pulivendula ZPTC Re polling at Two Centers
  • 3, 14 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్
  • భారీ పోలీస్ బందోబస్తు నడుమ రీపోలింగ్
  • బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు రెండు కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. పటిష్ఠమైన పోలీసు భద్రత నడుమ రీపోలింగ్ కొనసాగుతోంది. అచ్చువేల్లి, కొత్తపల్లె గ్రామాల్లోని 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతోంది. అచ్చువేల్లిలోని మొదటి పోలింగ్ బూత్‌లో 492 మంది ఓటర్లు ఉండగా, కొత్తపల్లెలోని పోలింగ్ బూత్‌లో 1273 మంది ఓటర్లు ఉన్నారు.

ఈ రోజు ఉదయం ఏడు గంటలకు రీ పోలింగ్ ప్రారంభం కాగా, ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహించనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు నిన్న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ జరిగింది. ఈ రెండు స్థానాలను కూటమి, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

అయితే జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 3, 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మంగళవారం పులివెందులలో 76.44 శాతం, ఒంటిమిట్టలో 81.53 శాతం పోలింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్ధులు బరిలో నిలవగా, మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. 
YS Avinash Reddy
Pulivendula ZPTC Election
Kadapa
Andhra Pradesh Local Body Elections
AP SEC
Ontimitta
YSRCP
TDP
Re-polling
Mareddy Latha Reddy
Hemanth Reddy

More Telugu News