Deve Gowda: భారత్ లో ఒక చిన్న వ్యాపారి కూడా ట్రంప్ కు ఆర్థిక పాఠాలు నేర్పించగలడు: దేవెగౌడ

Deve Gowda Slams Trumps Remarks on Indian Economy
  • భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర ఆగ్రహం
  • ట్రంప్ బెదిరింపులకు మోదీ ప్రభుత్వం లొంగలేదని ప్రశంసల వర్షం
  • ట్రంప్ అస్థిరమైన, బాధ్యతారహితమైన నేత అని తీవ్ర విమర్శలు
  • ట్రంప్ వ్యాఖ్యలను సమర్థించే విపక్ష నేతలకు దేవెగౌడ హితవు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై మాజీ ప్రధాని, జేడీ(ఎస్) నేత హెచ్‌డీ దేవెగౌడ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన ఆయన, ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని మనస్ఫూర్తిగా అభినందించారు. ట్రంప్ బెదిరింపులకు మోదీ సర్కార్ లొంగకుండా దేశ ప్రయోజనాలను కాపాడిందని ప్రశంసించారు. దేవెగౌడ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, జాతీయ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో దేవెగౌడ తన అభిప్రాయాలను వెల్లడించారు. "భారత ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైపోయిందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆధారరహిత, దురుసు వ్యాఖ్యలు నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆయనో అస్థిరమైన, అనాగరికమైన, బాధ్యతారహితమైన నేత. మన దేశంలో గౌరవంగా, నిజాయతీతో వ్యాపారం చేసుకునే ఓ చిన్న వ్యాపారి, ఓ పేద రైతు కూడా ట్రంప్‌కు ఎన్నో ఆర్థిక పాఠాలు నేర్పగలరు" అని దేవెగౌడ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశ ప్రయోజనాల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదని దేవెగౌడ స్పష్టం చేశారు. "ట్రంప్ బెదిరింపులకు భయపడకుండా, దేశ సార్వభౌమత్వాన్ని నిలబెట్టారు. దేశ జనాభాలో సగానికి పైగా ఆధారపడిన వ్యవసాయ రంగాన్ని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కాపాడేందుకు మోదీ ప్రభుత్వం తీసుకున్న దృఢమైన వైఖరి అభినందనీయం. ఈ నిర్ణయం దేశ పునరుజ్జీవనానికి దారి తీస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, అలాంటిది దానిని 'చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ'గా అభివర్ణించడం చూస్తుంటే ట్రంప్‌కు కళ్లు కనపడటం లేదో లేక సమాచార లోపమో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో, ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న కొందరు ప్రతిపక్ష నేతల తీరుపై కూడా దేవెగౌడ మండిపడ్డారు. వారి నిరాశను అర్థం చేసుకోగలనని, కానీ ఇలాంటి పనులు చేస్తూ తమను, తమ పార్టీలను నాశనం చేసుకుని, ట్రంప్‌తో పాటు చరిత్ర చెత్తబుట్టలో కలిసిపోవద్దని ఆయన హితవు పలికారు.
Deve Gowda
Donald Trump
Indian Economy
Narendra Modi
India US relations
economic policy
small business
farmers
economic growth
political criticism

More Telugu News