Chandrababu Naidu: గండికోట దశ మార్చే ప్రణాళిక.. యాంకర్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Plans Gandikota Transformation into Anchor Hub
  • నేడు గండికోట ప్రాంతాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు 
  • గండికోట సమగ్రాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన
  • రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టుల కోసం రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు
  • 'సాస్కీ' పథకం కింద రూ.78 కోట్ల ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన
  • అంతర్జాతీయ హంగులతో స్టార్ హోటళ్లు, రోప్‌వే, గ్లాస్ వాక్‌వే ఏర్పాటుకు నిర్ణయం
  • డిసెంబరు 26, 27 తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహించనున్నట్టు ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లోని చారిత్రక పర్యాటక కేంద్రమైన గండికోటను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం కడప జిల్లాలోని గండికోటలో నిర్వహించిన 'ఏపీ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక రంగంలోకి రూ.500 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షిస్తూ కీలక ఒప్పందాలు జరిగాయి.

భారతదేశ గ్రాండ్ కాన్యన్‌గా ప్రసిద్ధి చెందిన గండికోటను ఒక ప్రధాన ‘యాంకర్ హబ్’గా తీర్చిదిద్దనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ 'సాస్కీ' పథకం కింద రూ.78 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు వ్యూ పాయింట్, ఎకో ఫ్రెండ్లీ టెంట్ సిటీ, బోటింగ్, కోట వద్ద ప్రత్యేక లైటింగ్ వంటి సౌకర్యాలు కల్పించనున్నట్టు వివరించారు. ఈ ఏడాది చివరికల్లా టెంట్ సిటీని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా హిల్టన్ హోటల్స్, ఈజ్ మై ట్రిప్ వంటి ప్రముఖ సంస్థలతో ఏపీ టూరిజం కార్పొరేషన్ అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల ద్వారా గండికోటతో పాటు శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణంతో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, కయాకింగ్, జెట్ స్కీయింగ్ వంటి ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 50 వేల హోటల్ గదుల నిర్మాణమే లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.

గండికోటలో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు రోప్‌వే, గ్లాస్ బాటమ్ వాక్‌వే, లైట్ అండ్ సౌండ్ షోలను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సెప్టెంబరు నుంచే ఆకాశం నుంచి గండికోట అందాలను వీక్షించేందుకు హెలిరైడ్స్ సేవలను ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి కారావాన్ టూరిజం సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు.

విశాఖ, అరకు వ్యాలీ, రాజమహేంద్రవరం, అమరావతి, శ్రీశైలం, గండికోటలను 7 యాంకర్ హబ్ లు గా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. అలాగే 25 థీమాటిక్ సర్క్యుట్ లను కూడా ప్రకటించామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలను కూడా ప్రోత్సహిస్తామని అన్నారు. రాష్ట్రస్థాయిలో 8 పర్యాటక ఈవెంట్లను నిర్వహించటంతో పాటు జిల్లాల వారీగానూ కార్యక్రమాలు, టూరిజం ఫెస్టివల్స్ నిర్వహిస్తామన్నారు.

ఈ సందర్భంగా పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పిస్తున్నామని, పెట్టుబడిదారులు ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అంతకుముందు ముఖ్యమంత్రి గండికోట ప్రాంతాన్ని పరిశీలించి, అక్కడి పర్యాటకులు, స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. డిసెంబరు 26, 27 తేదీల్లో గండికోట ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
Chandrababu Naidu
Gandikota
Andhra Pradesh Tourism
AP Tourism Investors Meet
Tourism Development
Srisailam
Mantraalayam
Tirupati
Anchor Hub
Tourism Projects

More Telugu News