Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి'కి జాతీయ పురస్కారం... చంద్రబాబు, పవన్, లోకేశ్ ఏమన్నారంటే...!

Bhagavanth Kesari wins National Award Chandrababu Pawan Lokesh comments
  • 71వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా 'భగవంత్ కేసరి'
  • బాలకృష్ణ, చిత్ర బృందానికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
  • తెలుగు సినిమా విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందనలు
  • హను-మాన్, బేబీ, బలగం చిత్రాలకు కూడా పలు పురస్కారాలు
  • బాలా మామయ్యకు అవార్డుపై మంత్రి నారా లోకేశ్ హర్షం
71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రసీమ మరోసారి సత్తా చాటింది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'భగవంత్ కేసరి' ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ చిత్ర బృందానికి, ఇతర పురస్కార గ్రహీతలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఇది గొప్ప విషయం: చంద్రబాబు

తెలుగు సినీ హీరో, పద్మ భూషణ్ నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకు 2023 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు రావడం ఆనందంగా ఉంది. నాడు ప్రేక్షకాదరణ పొందిన ఈ చిత్రానికి ఇప్పుడు అవార్డులు కూడా రావడం గొప్ప విషయం. బాలకృష్ణ గారికి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ సీఎం చంద్రబాబు స్పందించారు.

విజేతలకు అభినందనలు: పవన్ కల్యాణ్

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకం. ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి,శ్రీ హరీష్ పెద్ది లకు అభినందనలు. ఉత్తమ వి.ఎఫ్.ఎక్స్. చిత్రంగా ‘హను-మాన్’ చిత్రం నిలిచింది. ఈ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ, వి.ఎఫ్.ఎక్స్.నిపుణులకు, నిర్మాతకు అభినందనలు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నీలం సాయి రాజేష్ (బేబీ చిత్రం), ఉత్తమ గీత రచయితకాసర్ల శ్యామ్ (బలగం), ఉత్తమ గాయకుడు పి.వి.ఎన్.ఎస్.రోహిత్ (బేబీ), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్  నందు పృథ్వీ (హను-మాన్), ఉత్తమ బాలనటి సుకృతి వేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు) పురస్కారాలకు ఎంపికైనందుకు వారికి హృదయపూర్వక అభినందనలు. ఈ పురస్కారాలు చిత్ర పరిశ్రమకు నూతనోత్సాహాన్ని అందిస్తాయి. జాతీయ ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే, ఉత్తమనటిగా రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడుగా సుదీప్తో సేన్, ఇతర పురస్కార విజేతలకు అభినందనలు... అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

బాలా మామయ్య చిత్రానికి అవార్డు రావడం సంతోషదాయకం: నారా లోకేశ్

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బాలా మామయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం చాలా సంతోషం. బాలా మామయ్య నటన, సందేశాత్మక చిత్రంగా ప్రేక్షకుల మన్ననలు అందుకున్న భగవంత్ కేసరికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా బాలా మామయ్యకు, డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి, చిత్ర బృందానికి అభినందనలు.. అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు.
Bhagavanth Kesari
Nandamuri Balakrishna
National Film Awards
Telugu cinema
Chandra Babu Naidu
Pawan Kalyan
Nara Lokesh
Anil Ravipudi
Hanuman movie

More Telugu News