Doctor negligence: ఎమర్జెన్సీ వార్డులో ఏసీ వేసుకుని వైద్యుడి నిద్ర.. వైద్యం అందక పేషెంట్ మృతి.. వీడియో ఇదిగో!

Patient dies due to doctor negligence in Meerut LLRM hospital
  • ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ లో అమానవీయ ఘటన
  • వైద్యుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయిందని బాధితుల ఆవేదన
  • డాక్టర్ ను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
ఉత్తరప్రదేశ్ లోని మేరఠ్ లో విషాదం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి చేరిన ఓ బాధితుడు వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా మృత్యువాత పడ్డాడు. సమయానికి వైద్యం అందక స్ట్రెచర్ పైనే కన్నుమూశాడు. ఓవైపు రక్తమోడుతూ బాధితుడు ఆర్తనాదాలు చేస్తున్నా.. భుజాన చంటిబిడ్డతో బాధితుడి భార్య ప్రాధేయపడుతున్నా వైద్యుడు మాత్రం నిద్ర నుంచి లేవలేదు. ఎమర్జెన్సీ వార్డులో సేవలందించాల్సిన వైద్యుడు ఏసీ వేసుకుని మరీ నిద్రిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వైద్యుడి నిర్ల్యక్ష్యం కారణంగా నిండు ప్రాణం పోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉన్నతాధికారులు స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు వైద్యుడిని సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి మేరఠ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సునీల్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సునీల్ కుమార్ ను బంధువులు స్థానికంగా ఉన్న లాలా లజపతిరాయ్ మెమోరియల్ ప్రభుత్వ ఆసుపత్రి (ఎల్ఎల్ఆర్ఎం)కి తరలించారు.

స్ట్రెచర్ పై ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లగా.. అక్కడ విధుల్లో ఉన్న జూనియర్ రెసిడెంట్ డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ ఏసీ వేసుకుని కుర్చీలోనే నిద్రిస్తుండడం కనిపించింది. దీంతో సునీల్ కుమార్ భార్య వైద్యుడి దగ్గరికి వెళ్లి నిద్రలేపేందుకు ప్రయత్నించింది. భుజాన చంటిబిడ్డతో సునీల్ భార్య వైద్యుడిని ఎంతగా ప్రాధేయపడ్డా డాక్టర్ భూపేశ్ నిద్రలేవలేదు. గంటల తరబడి వైద్యం అందకపోవడంతో రక్తస్రావం కారణంగా సునీల్ కుమార్ కన్నుమూశాడు. ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్ భూపేశ్ నిద్రించడం, సునీల్ కుమార్ భార్య ప్రాధేయపడడం బాధిత కుటుంబ సభ్యులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో వైరల్ కావడం, బాధిత కుటుంబం ఆందోళన చేయడంతో ఎల్ఎల్ఆర్ఎం మెడికల్ కాలేజీ ఉన్నతాధికారులు స్పందించారు. డాక్టర్ భూపేశ్ కుమార్ రాయ్ ను సస్పెండ్ చేయడంతో పాటు ఈ ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు. కాగా, ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వర్తించాల్సిన వైద్యుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని పట్టించుకోకుండా నిద్రించడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Doctor negligence
Patient death
Uttar Pradesh
Emergency ward
Bhupesh Kumar Rai
Meerut road accident
LLRM hospital
Suspension
Medical negligence
India news

More Telugu News