Sonia Gandhi: ప్రధాని మోదీపై విరుచుకుపడిన సోనియాగాంధీ

Sonia Gandhi Slams Modi Over Gaza Silence
  • ‘దైనిక్ జాగరణ్‌’కు వ్యాసం రాసిన సోనియాగాంధీ
  • గాజా సంక్షోభంపై మోదీ మౌనాన్ని తప్పుబట్టిన సోనియా
  • రాజ్యాంగ విలువలకు ద్రోహం చేస్తున్నారని మండిపాటు
గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంక్షోభంపై 'నీచమైన మౌనం' వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. గాజా ప్రజలకు మద్దతుగా భారతదేశం 'స్పష్టమైన, ధైర్యవంతమైన' వైఖరిని తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం దైనిక్ జాగరణ్‌లో ప్రచురితమైన ఆమె వ్యాసంలో ఈ మేరకు పేర్కొన్నారు.

'గాజా సంకట్ పర్ మూక్‌దర్శక్ మోదీ సర్కార్' (గాజా సంక్షోభంపై మౌనంగా ఉన్న మోదీ సర్కార్) అనే శీర్షికతో ప్రచురితమైన తన వ్యాసంలో సోనియా గాంధీ ఇజ్రాయెల్ చర్యలను 'బార్బరిక్' (అనాగరికం), 'జెనోసైడ్' (మారణహోమం)గా అభివర్ణించారు. గాజాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విధించిన సైనిక నిర్బంధం, ఔషధాలు, ఆహారం, ఇంధన సరఫరాను క్రూరంగా నిరోధించడం 'మానవత్వానికి వ్యతిరేకమైన నేరం' అని ఆమె ఆరోపించారు. గాజా సంక్షోభంపై ప్రధానమంత్రి మోదీ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం 'రాజ్యాంగ విలువలకు ద్రోహం' అని ఆమె తీవ్రంగా విమర్శించారు.

2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడులు, ఇజ్రాయెలీ బందీలపై కొనసాగిస్తున్న చర్యలను తాను ఏమీ సమర్థించబోనని సోనియా స్పష్టం చేశారు. అయితే, ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా పౌరులపై చేపట్టిన ప్రతీకార చర్యలు 'అత్యంత దారుణమైనవి, నేరపూరితమైనవి' అని ఆమె ఆరోపించారు. గత రెండేళ్లలో గాజాలో 55,000 మంది పౌరులు, అందులో 17,000 మంది పిల్లలు మరణించారని, చాలా వరకు నివాస భవనాలు ధ్వంసమయ్యాయని, గాజా సామాజిక వ్యవస్థ పూర్తిగా శిథిలమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశ చారిత్రక వైఖరి
1974లో ఇందిరా గాంధీ నాయకత్వంలో పాలస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో)ను పాలస్తీనియన్ ప్రజల ఏకైక చట్టబద్ధమైన ప్రతినిధిగా గుర్తించిన మొదటి అరబ్ యేతర దేశంగా భారత్ నిలిచిందని సోనియా గుర్తు చేశారు. 1988లో పాలస్తీన్ దేశాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశాలలో భారతదేశం ఒకటని ఆమె పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు మరోసారి భారతదేశం నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాయని, మోదీ 'స్పష్టంగా, ధైర్యంగా, సూటిగా' మాట్లాడాలని సోనియా కోరారు.
Sonia Gandhi
Gaza
Israel
Narendra Modi
Palestine
India
Congress
Israel Palestine conflict
Gaza crisis
Sonia Gandhi statement

More Telugu News