Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం.. 'బంగారు కుటుంబాల'ను దత్తత తీసుకుంటానని వెల్లడి

Chandrababu Naidu Announces Adoption of Bangaru Kutumbalu
  • పేదరికంపై చేస్తున్న పోరులో తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారన్న చంద్రబాబు
  • పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతుందన్న చంద్రబాబు
  • ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలన్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనలో భాగంగా తాను కొన్ని బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు. సచివాలయంలో జీరో పావర్టీ - పీ4పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పీ4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని ఆయన అన్నారు. పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పీ4లో కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని ఆయన అన్నారు.

గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా, 57,503 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. లక్ష్యం నెరవేరడానికి మరో రెండు లక్షల మంది మార్గదర్శులు అవసరమని తెలిపారు. పల్నాడు జిల్లా నుంచి అత్యధికంగా బంగారు కుటుంబాల దత్తత జరిగిందని, విశాఖపట్నం చివరలో ఉందని అధికారులు వివరించారు. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆటోమేటెడ్ సందేశం రూపంలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Poverty eradication
Bangaru Kutumbalu
Adoption program

More Telugu News