Anantha Babu: డ్రైవర్ హత్య, డోర్ డెలివరీ కేసు.. హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చుక్కెదురు

Anantha Babu Faces Setback in High Court in Driver Murder Case
  • సుబ్రహ్మణ్యం హత్య కేసులో స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
  • 90 రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఆదేశాలు
  • ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించిన అనంతబాబు
దళిత యువకుడు, మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది.

మూడేళ్ల క్రితం కాకినాడలో సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. డ్రైవర్‌ను హత్య చేసిన అనంతరం డోర్ డెలివరీ చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో అనంతబాబు నేరం అంగీకరించినట్లు మీడియా సమావేశంలో అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. అనంతబాబును రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రిమాండుకు పంపించారు. ఆ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.

అయితే, తమకు న్యాయం కావాలని, ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించి అనంతబాబుపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఈ కేసులో న్యాయం చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆ కుటుంబానికి హామీ ఇచ్చింది.

మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు, కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవల కోర్టును ఆశ్రయించగా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం అంగీకరించింది. 90 రోజుల్లో అదనపు ఛార్జిషీట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది. ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ అనంతబాబు హైకోర్టును ఆశ్రయించగా, ఆయనకు చుక్కెదురైంది.
Anantha Babu
Anantha Babu MLC
Subrahmanyam murder case
YSRCP MLC
Andhra Pradesh High Court

More Telugu News