YVSS Bhaskar Rao: కాలధర్మం చెందాక వీలునామాతో తిరుమల శ్రీవారికి కోట్ల రూపాయల భారీ విరాళం

IRS Officer YVSS Bhaskar Rao Donates Crores to Tirumala Temple Through Will
  • టీటీడీకి చెందేలా వీలునామా రాసిన ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావు
  • రూ. 3 కోట్ల నివాస గృహం, రూ. 66 లక్షల నగదు టీటీడీకి చెందేలా వీలునామా
  • టీటీడీకి ఆస్తి పత్రాలు, చెక్కులను అందించిన ట్రస్టీలు
హైదరాబాద్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి వైవీఎస్ఎస్ భాస్కర్ రావుకు చెందిన రూ. 3 కోట్లకు పైగా ఆస్తి, నగదును ట్రస్టీలు తిరుమల తిరుపతి దేవస్థానంకు అందించారు. వైవీఎస్ఎస్ భాస్కర్ రావు ఇటీవల కన్నుమూశారు.

ఆయన చివరి కోరిక మేరకు ట్రస్టీలు తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందజేశారు. భాస్కర్ రావు మరణానంతరం తన ఆస్తులను వీలునామా ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి అందేలా ఏర్పాటు చేశారు.

ఈ మేరకు ట్రస్టీలు ఎం. దేవరాజ్ రెడ్డి, సత్యనారాయణ, లోకనాథ్ వీలునామాకు సంబంధించిన పత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారు. రూ. 3 కోట్ల విలువైన నివాస గృహంతో పాటు రూ. 66 లక్షలను విరాళంగా ప్రకటిస్తూ భాస్కర్ రావు వీలునామా రాశారు. వనస్థలిపురంలో 'ఆనంద నిలయం' పేరుతో ఉన్న 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవనాన్ని ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వినియోగించాలన్న ఉద్దేశంతో టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నారు.

బ్యాంకులో దాచుకున్న డబ్బులో టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 36 లక్షలు, సర్వశ్రేయాస్, వేదపరిరక్షణ, గో సంరక్షణ, విద్యాదాన, శ్రీవాణి ట్రస్టులకు రూ. 6 లక్షల చొప్పున విరాళంగా ఇవ్వాలని ఆయన తన వీలునామాలో పేర్కొన్నారు. భాస్కర్ రావు చివరి కోరిక మేరకు ట్రస్టీలు టీటీడీకి చెందాల్సిన ఆస్తి పత్రాలు, చెక్కులను తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.
YVSS Bhaskar Rao
Tirumala
TTD
Tirupati
Donation
Will
Ananda Nilayam
IRS Officer

More Telugu News