Nara Lokesh: దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు!: నారా లోకేశ్

Nara Lokesh Focuses on Mangalagiri Gems and Jewellery Park Development
  • మంగళిగిరిలో టాప్-20 జ్యుయలరీ సంస్థల యూనిట్లు స్థాపించేలా చర్యలు
  • ప్రతిఏటా 4 వేల మందికి శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ
  • అధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సమీక్ష
దేశంలో అత్యుత్తమ మోడల్ తో మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు నిర్మాణంచేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. మంగళగిరి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుపై అధికారులతో మంత్రి సమీక్షించారు. 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కుతో పాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచస్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీసంస్థలు మంగళగిరి పార్కులో తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. 

ఉడిపిలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెమ్స్ అండ్ జ్యుయలరీ (ఐఐజీజే) పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై స్కిల్ డెవలప్ మెంట్ సీఈవో గణేశ్ కుమార్ స్పందిస్తూ త్వరలో ఏర్పాటుచేసే కామన్ ఫెసిలిటీ సెంటర్ మరియు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ప్రతిఏటా 4 వేలమందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. పార్కులో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఈఓ), కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్ సీ), ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ అండ్ రిటైల్ జోన్, మ్యానుఫాక్చరింగ్ జోన్, రెసిడెన్షియల్ జోన్, ఇన్ ఫ్రా జోన్ అంతర్భాగాలు ఉంటాయని తెలిపారు. 

మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... మంగళగిరిలో యువతకు నైపుణ్యశిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ) కూడా త్వరితగతిన ఏర్పాటు చెయ్యాలని అన్నారు. ఎంసీసీ ద్వారా కెరీర్ కోచింగ్, జాబ్ మ్యాచింగ్, స్కిల్ అప్ గ్రేడేషన్, ఎంప్లాయర్ ఎంగేజ్ మెంట్ చేపట్టాలని అన్నారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన 3 జాబ్ ఫెయిర్లకు 1,170మంది యువకులు హాజరుకాగా, 453 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేశ్ స్పందిస్తూ... ఇకపై ప్రతినెలా జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు నూరుశాతం ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు.
Nara Lokesh
Mangalagiri
Gems and Jewellery Park
Andhra Pradesh
Jewellery Manufacturing
Skill Development
Job Fairs
MSME
Training Center
Retail Shops

More Telugu News