India China relations: భారత్ కీలక నిర్ణయం... చైనా పౌరులకు మళ్లీ పర్యాటక వీసాలు జారీ

India to resume tourist visas for Chinese citizens
  • 2020లో గాల్వన్ లోయ వద్ద భారత్-చైనా బలగాల ఘర్షణలు
  • చైనా టూరిస్టులకు వీసాలు నిలిపివేసిన భారత్
  • ఇటీవల కాలంలో సత్ఫలితాలు ఇస్తున్న చర్చలు
  • చైనా పౌరులకు టూరిస్టు వీసాలు జారీ చేయాలని భారత్ నిర్ణయం
గాల్వన్ వద్ద 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణల తర్వాత చైనా పౌరులకు పర్యాటక వీసాలను భారత్ నిలిపివేయడం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా చైనా వైఖరిలో మార్పు వచ్చింది. భారత్-చైనా మధ్య పలు చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా పర్యాటకులకు తిరిగి వీసాలు మంజూరు చేయాలని భారత్ నిర్ణయించింది. ఈ నిర్ణయం జూలై 24 నుంచి అమలులోకి వస్తుందని చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. సరిహద్దు వివాదాలు, వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా దెబ్బతిన్న సంబంధాలను మెరుగుపరచడం దీని లక్ష్యం.

గాల్వాన్ ఘర్షణల తర్వాత భారత్ చైనా పెట్టుబడులు, యాప్‌లపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఏర్పడిన దౌత్యపరమైన స్తంభన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది. 2022లో భారతీయ విద్యార్థులకు, వ్యాపార యాత్రికులకు చైనా వీసాలను తిరిగి ప్రారంభించినప్పటికీ, భారత్ మాత్రం చైనా పౌరులకు పర్యాటక వీసాల జారీని ఇప్పటివరకు నిలిపి ఉంచింది.

తాజాగా, భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చైనా స్వాగతించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాట్లాడుతూ, నిరంతర చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలతో దౌత్యపరమైన వాతావరణం మెరుగుపడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ... 3,800 కిలోమీటర్ల వివాదాస్పద సరిహద్దు సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ఇరుదేశాల సంబంధాలు పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావాలంటే.... సైనిక ప్రతిష్టంభనను పరిష్కరించడం, వాణిజ్య ఆంక్షలను ఎత్తివేయడం అవసరమని భారత విదేశాంగ మంత్రి నొక్కి చెప్పారు.
India China relations
China India
Indian Embassy China
India tourism visa
Galwan clash
China travel ban
India China border dispute
Narendra Modi
Xi Jinping
India China trade

More Telugu News