Rana Daggubati: రానా దగ్గుబాటికి మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ

Rana Daggubati Gets Another ED Notice
  • షూటింగ్ కారణంగా విచారణకు హాజరు కాలేనన్న రానా
  • ఆగస్టు 11న కచ్చితంగా హాజరు కావాలంటూ ఈడీ మరో నోటీసు
  • బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన కేసులో నలుగురు సినీ ప్రముఖులకు నోటీసులు
బెట్టింగ్ యాప్‌ల కేసులో సినీ నటుడు రానా దగ్గుబాటికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని రానా ఈడీని కోరారు. ఈ నేపథ్యంలో ఈడీ ఆయన విజ్ఞప్తిని మన్నించి, మరో తేదీని ఖరారు చేసింది. ఆగస్టు 11న తప్పకుండా విచారణకు హాజరు కావాలని తాజా నోటీసుల్లో పేర్కొంది.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు నిర్వాహకులు ఇచ్చిన పారితోషికానికి సంబంధించి మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో రానాతో పాటు సినీ నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. 

ఇంతకుముందు ఇచ్చిన నోటీసులు ప్రకారం రానా నేడు (జులై 23) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఆయన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు, సినిమా షూటింగ్‌ల కారణంగా విచారణకు హాజరు కాలేనని, కొంత గడువు కావాలని రానా కోరారు. ఆయన విజ్ఞప్తికి ఈడీ అంగీకరించింది. మంచు లక్ష్మి కూడా విచారణకు హాజరు కావడానికి సమయం కోరారు.
Rana Daggubati
ED
Enforcement Directorate
Betting Apps Case
Money Laundering

More Telugu News