Pawan Kalyan: ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాపై స్పందించిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌

Pawan Kalyans Response to Jagdeep Dhankhar Resignation
  • జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై 'ఎక్స్' వేదిక‌గా ప‌వ‌న్‌ స్పెష‌ల్ పోస్టు
  • రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడారంటూ పొగ‌డ్త‌లు
  • నిష్పాక్షిక‌త, నిబ‌ద్ధ‌త‌తో బాధ్య‌త‌లు నిర్వ‌హించార‌న్న‌ జ‌న‌సేనాని
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్య రీతిలో తన పదవికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఆరోగ్య కారణాలను చూపుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు త‌న‌ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇక‌, ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. రాజ్యాంగ విలువ‌ల‌ను కాపాడుతూ నిష్పాక్షిక‌త, నిబ‌ద్ధ‌త‌తో బాధ్య‌త‌లు నిర్వ‌హించార‌ని జ‌న‌సేనాని కొనియాడారు. 

"గౌరవనీయులైన భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖ‌డ్‌ జీ, మీరు భారత్‌కు అంకితభావంతో విలువైన సేవ చేసినందుకు మీకు ధన్యవాదాలు. మీ పదవీకాలం అంతా మీరు ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని అచంచలమైన నిబద్ధతతో నిలబెట్టారు. రాజ్యాంగ విలువలను కాపాడారు. దయ, నిష్పాక్షికత, సమగ్రతతో మీరు బాధ్య‌త‌లు నిర్వహించారు. 

రాజకీయ ఒత్తిడి లేకుండా మీ నిర్భయమైన అభిప్రాయాల వ్యక్తీకరణ ప్రజా జీవితానికి ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశించింది. గౌరవనీయమైన పాత్ర నుంచి వైదొలగుతున్న మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతమైన జీవ‌నం ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను" అని ప‌వ‌న్ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 

కాగా, జగదీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు 11 నుంచి భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు అందుకున్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా సేవలు అందించారు. అంతకుముందు, ఆయన 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. తన రాజీనామాకు ముందు, ఆయన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ ఛైర్మన్‌గా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా, రాజకీయ విభేదాలను పక్కనపెట్టి, ఆరోగ్యకరమైన చర్చలు జరపాలని ఆయన రాజకీయ పక్షాలను కోరారు.


Pawan Kalyan
Jagdeep Dhankhar
Deputy CM Andhra Pradesh
Vice President Resignation
Janasena Party
Indian Politics
Rajya Sabha Chairman
West Bengal Governor
Political News
India

More Telugu News