Chennakeshavulu: నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి దూరిన కొండచిలువ

Python Scare Chennakeshavulu Wakes Up to Snake in Bed in Telangana
  • ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరులోని చెలిమిళ్ల కాలనీలో ఘటన
  • కుక్కల అరుపులతో మేల్కొన్న యువకుడు
  • పరుపులో కదలికను గుర్తించడంతో తప్పిన ప్రమాదం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు పట్టణంలోని చెలిమిళ్ల కాలనీలో సోమవారం తెల్లవారుజామున ఒక భయానక ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న యువకుడి పరుపులోకి ఏకంగా ఏడడుగుల కొండచిలువ దూరడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. పెళ్లూరు చెన్నకేశవులు ఆదివారం రాత్రి తన ఇంటి వరండాలో పరుపు వేసుకుని పడుకున్నాడు. తెల్లవారుజామున సుమారు 3:45 గంటల సమయంలో కుక్కలు అకస్మాత్తుగా అరవడం మొదలుపెట్టాయి. దీంతో నిద్రలేచిన చెన్నకేశవులు, తన పరుపులో ఏదో కదులుతున్నట్టు గమనించాడు. వెంటనే లేచి చూసుకోగా తన పరుపులో ఉన్నది ఒక పెద్ద కొండచిలువ అని గ్రహించి భయపడిపోయాడు. వెంటనే తన పెద్దనాన్న సాయన్నకు సమాచారం అందించాడు.

స్నేక్ సొసైటీ ఎంట్రీ.. సురక్షితంగా బంధించి..
చెన్నకేశవులు కేకలు విన్న చుట్టుపక్కల వారు గుమిగూడే సమయానికే, కొండచిలువ పరుపులోంచి బయటకు వచ్చి మెట్ల కిందకు వెళ్లి దాక్కుంది. స్థానిక యువకుడు మల్లేశ్ వెంటనే వనపర్తిలోని సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఆయన సొసైటీ సభ్యులు చిలుక కుమార్ సాగర్, అవినాశ్‌లతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సొసైటీ బృందం అత్యంత చాకచక్యంగా, ఆ ఏడడుగుల పొడవు, 13 కిలోల బరువు గల కొండచిలువను బంధించారు. అనంతరం, పెద్దగూడెంలోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ విజయ్ సమక్షంలో ఆ సర్పరాజును సురక్షితంగా విడిచిపెట్టారు. వర్షాకాలంలో ఇలాంటి సరీసృపాలు నివాస ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా పాములు కనిపిస్తే వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని వారు కోరారు.
Chennakeshavulu
snake
python
Mahbubnagar
Pebbair
snake society
forest department
rescue
wildlife

More Telugu News