Jakkampudi Raja: జక్కంపూడి రాజా దీక్ష భగ్నం.. హౌస్ అరెస్ట్

Rajahmundry Police Foil Jakkampudi Rajas Indefinite Fast
  • ఏపీ పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జక్కంపూడి డిమాండ్
  • పేపర్ మిల్లు ఎదురుగా ఆమరణ దీక్షకు ఏర్పాట్లు
  • ముందుగానే అదుపులోకి తీసుకున్న పోలీసులు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆమరణ దీక్షను పోలీసులు ముందుగానే భగ్నం చేశారు. రాజమండ్రిలోని ఏపీ పేపర్ మిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన నేటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. పేపరు మిల్లు గేటు ఎదురుగా ఉన్న కళ్యాణమంటపంలో దీక్ష చేయడానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమయంలో అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు ఆయనను, 50 మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. జక్కంపూడిని ఇంటికి తరలించి, హౌస్ అరెస్ట్ చేశారు.

రాజమండ్రిలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉందని, పేపర్ మిల్లు సమీపంలో ఎవరూ ఆందోళనలు చేపట్టవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రస్తుతం జక్కంపూడి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

మరోవైపు అంతకుముందు మీడియాతో రాజా మాట్లాడుతూ... పేపర్ మిల్లు కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాల కల్పన విషయంలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ అన్యాయాన్ని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందని... పేపరు మిల్లు కార్మికుల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ... యాజమాన్యంతో వారి చర్చలు సఫలీకృతం కాలేదని అన్నారు. యాజమాన్యంతో తాము అమీతుమీ తేల్చుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
Jakkampudi Raja
YSRCP
AP Paper Mill
Rajahmundry
Hunger Strike
House Arrest
Labor Dispute
Andhra Pradesh
Wage Agreement
Paper Mill Workers

More Telugu News