Vipanchika Maniyan: షార్జాలో పసిబిడ్డను చంపి కేరళ మహిళ ఆత్మహత్య.. వెలుగులోకి సంచలన విషయాలు

Vipanchika Maniyan Suicide Note Reveals Shocking Details of Harassment in Sharjah
  • విపంచిక ఫేస్‌బుక్‌లో సూసైడ్ నోట్
  • భర్త, అత్తమామల నుంచి వరకట్న వేధింపులు
  • ఆమె తెల్లగా ఉండటంతో అంద వికారంగా కనిపించేందుకు గుండు కొట్టించిన వైనం
  • మృతదేహాలను కేరళకు తీసుకొచ్చేందుకు షార్జాకు వెళ్లిన బాధితురాలి తల్లి
షార్జాలో కేరళకు చెందిన 33 ఏళ్ల మహిళ, ఆమె ఏడాది బిడ్డ విగత జీవులుగా కనిపించిన కేసులో ఆమె ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో కనిపించిన ఓ పోస్ట్ సంచలన విషయాలను వెల్లడించింది. భర్త, అత్తమామల నుంచి ఆమె ఎదుర్కొన్న భయంకరమైన వేధింపుల వివరాలను ఆమె అందులో పేర్కొంది. కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన విపంచిక మణియన్, ఆమె ఏడాది కుమార్తె వైభవి ఈ నెల 8న షార్జాలోని అల్ నహ్దాలోని ఒక అపార్ట్‌మెంట్‌లో విగత జీవులుగా కనిపించారు. విపంచిక తొలుత బిడ్డను చంపి, ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు.

ఆమె ఫేస్‌బుక్ ఖాతాలో గుర్తించిన సూసైడ్ నోట్‌లో విపంచిక తన అత్తమామాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నోట్ ఆధారంగా కేరళలోని కుందరా పోలీసులు ఆమె భర్త నిధీష్ విలియవీట్టిల్, అతడి సోదరి నీతు బెన్నీ, వారి తండ్రి మోహనన్‌లపై కేసు నమోదు చేశారు. విపంచిక, నిధీష్ 2020లో వివాహం చేసుకున్నారు. అనంతరం షార్జాకు వెళ్లారు. విపంచిక ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తీవ్రమైన శారీరక, మానసిక వేధింపులకు గురైనట్టు ఆమె తల్లి శైలజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

డబ్బుల కోసం తనను వేధించేవారని, వివాహం గొప్పగా జరగలేదని, కారు లేదని హేళన చేసేవారని విపంచిక తన సూసైడ్ నోట్‌లో ఆవేదన వ్యక్తంచేసింది. ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ డబ్బుల కోసం వేధించేవారని పేర్కొంది. అంతేకాకుండా భర్త తనను ‘కుక్కలా కొట్టేవాడని’, పోర్న్ వీడియోలు చూస్తూ బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొనేవాడని వివరించింది. ఏడు నెలల గర్భిణిగా ఉన్నప్పుడు ఇంటి నుంచి గెంటేశారని కూడా పేర్కొంది. విపంచికను ఆమె రూపం కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని ఆమె తల్లి శైలజ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తెల్లగా ఉండటంతో అసహ్యంగా కనిపించేలా గుండు గీయించారని, నిధీష్‌కు ఉన్న వివాహేర సంబంధం గురించి ప్రశ్నిస్తే విడాకుల నోటీసు ఇచ్చారని పేర్కొన్నారు.

కాగా, విపంచికది ఆత్మహత్య కాదని, డబుల్ మర్డర్ అని ఆమె కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని వేడుకున్నారు. షార్జాలో ఉన్న తన కుమార్తె, మనవరాలి మృతదేహాలను కొల్లంలోని స్వస్థలానికి తిరిగి తీసుకురావడానికి శైలజ మంగళవారం షార్జాకు చేరుకున్నారు. 
Vipanchika Maniyan
Sharjah
Kerala woman suicide
domestic violence
harassment
suicide note
child death
Nidheesh Viliyaveettil
dowry harassment
Kollam

More Telugu News