Kanchukota Murali: భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ తుపాకితో కాల్చుకున్న జవాన్

CRPF Jawan Kanchukota Murali Dies by Suicide in Chhattisgarh
  • ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘటన
  • ఆత్మహత్యకు ముందు భార్యకు ఫోన్ చేసి బాగోగులు అడిగిన జవాన్
  • పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేయాలన్న మురళి
  • అనంతరం తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య
  • అప్పుల కారణంగా పెరిగిన ఆర్థిక ఒత్తిడిని తట్టుకోలేకే ఆత్మహత్య!
భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ సీఆర్‌పీఎఫ్ జవాను ఒకరు తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 65వ బెటాలియన్‌లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళితే.. శ్రీసత్యసాయి జిల్లా, కనగానపల్లి మండలం శివపురంకొట్టాలకు చెందిన జవాన్ కంచుకోట మురళి (30) ఆదివారం రాత్రి పది గంటల సమయంలో తన భార్య లోకపావనితో ఫోన్‌లో మాట్లాడాడు. భోజనం అయిందా? పిల్లలు తిన్నారా? అని అడిగాడు. నాన్న ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోందని, జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, పిల్లలను బాగా చదివించి గొప్పస్థానంలో ఉంచుదామని చెప్పాడు. ఇప్పటికే రూ. 34 లక్షల అప్పు అయిందని, నువ్వు కుటుంబానికి ఆసరాగా ఉండి జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు. ఆ తర్వాత ‘సెలవు’ అని చెప్పి తుపాకితో కాల్చుకున్నాడు.

పావని పిలిచినా అటునుంచి స్పందన రాలేదు. సమీపంలోని  సహచర జవాన్ శబ్దం విని చూసే సరికి మురళి నేలపై కుప్పకూలిన స్థితిలో కనిపించాడు.  మురళి 2017లో సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా చేరాడు. అనంతపురానికి చెందిన లోకపావనిని ఐదు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు తారక్‌రామ్, రెండేళ్ల కుమార్తె మహి ఉన్నారు.

మురళి తండ్రి ముత్యాలన్న చర్మ క్యాన్సర్‌తో బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చికిత్స కోసం దాదాపు 30 లక్షల రూపాయల అప్పు తీసుకున్నారు. అదే సమయంలో మురళి సోదరికి పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇదిలా ఉండగా, నాలుగు నెలల క్రితం మురళి కారును స్నేహితుడు నడుపుతుండగా పెనుకొండ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదంలో కారు నంబర్ ఆధారంగా మురళిని సంప్రదించిన మృతుడి కుటుంబం కేసు రాజీ కోసం 15 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. దీంతో తండ్రి వైద్యం కోసం దాచిన రూ. 4 లక్షలను వారికి ఇచ్చాడు. దీంతో మొత్తం అప్పు రూ. 34 లక్షలకు చేరుకుంది.  తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో 15 రోజుల క్రితం బెంగళూరుకు వచ్చిన మురళి తిరిగి బెటాలియన్‌కు చేరుకున్నాడు. ఆదివారం రాత్రి ఆర్థిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.  
Kanchukota Murali
CRPF Jawan
Suicide
Chhattisgarh
Loan Debt
Family Problems
Financial Issues
Sri Sathya Sai District

More Telugu News