Scott Boland: ఆస్ట్రేలియా స్టార్ స్కాట్ బోలాండ్ ప్రపంచ రికార్డు.. 1915 తర్వాత ఇదే అత్యుత్తమం!

Scott Boland Sets World Record After 1915
  • 17.33 సగటుతో 59 వికెట్లు తీసిన స్కాట్ బోలాండ్
  • 1915 తర్వాత టెస్టుల్లో ఇదే అత్యుత్తమ సగటు
  • విండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఘటన
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అసాధారణ రికార్డు నెలకొల్పాడు. కనీసం 2000 బంతులు వేసిన బౌలర్లలో 1915 తర్వాత అత్యుత్తమ టెస్ట్ బౌలింగ్ సగటు (17.33) సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఈ ఘనత సాధించాడు. మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టిన స్కాట్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 110 సంవత్సరాల టెస్ట్ క్రికెట్‌లో (1915 నుంచి) కనీసం 2000 బంతులు వేసిన బౌలర్లలో స్కాట్ అత్యుత్తమంగా నిలిచినట్టు ఐసీసీ తెలిపింది. 

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 225 పరుగులు చేసినప్పటికీ, జట్టులోని నలుగురు ఫాస్ట్ బౌలర్లు విజృంభించి విండీస్‌ను 143 పరుగులకే ఆలౌట్ చేసి, 82 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించారు. స్కాట్ బోలాండ్ ఈ ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించాడు. విండీస్ టాప్-స్కోరర్ జాన్ క్యాంప్‌బెల్ (36) వికెట్‌ను తీసి, ఆ తర్వాత హోప్ (23)ను ఔట్ చేశాడు. అనంతరం షమర్ జోసెఫ్ (8)ను పెవిలియన్ పంపాడు.   

స్కాట్ బోలాండ్ 17.33 టెస్ట్ బౌలింగ్ సగటు 59 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా 1915 తర్వాత కనీసం 2000 బంతులు వేసిన బౌలర్లలో అత్యుత్తమంగా నిలిచాడు. 1900 తర్వాత ఇంగ్లండ్ బౌలర్ సిడ్ బార్న్స్ (16.43 సగటు) మాత్రమే బోలాండ్ కంటే మెరుగైన సగటును కలిగి ఉన్నాడు. మిగిలిన ఆరుగురు అత్యుత్తమ బౌలర్లు 1800ల నాటి టెస్ట్ క్రికెట్ ఆరంభ దశలలో ఆడినవారే కావడం గమనార్హం. 
Scott Boland
Scott Boland record
Australia cricket
West Indies cricket
Test cricket
bowling average
Sabina Park
cricket record
ICC
Sid Barnes

More Telugu News