మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నా.. మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
- కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు
- పిల్లలను తల్లిదండ్రులు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు..
- రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని హెచ్చరిక
ఉజ్జయినీ మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా.. అని అర్చకులు ఆమెను ప్రశ్నించారు. అందుకు మాతంగి స్వర్ణలత సమాధానం చెబుతూ.. ప్రజలంతా డప్పుచప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారని తెలిపారు. వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని పలికారు. కానీ, ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని.. తనను ఎవరూ లెక్కచేయడం లేదని అమ్మవారు చెప్పారు. రాసుల కొద్దీ సంపదను తాను రప్పించుకుంటున్నా.. గోరంతైనా తనకు దక్కడంలేదని, సక్రమంగా పూజలు జరిపించాలి బాలకా అంటూ అమ్మవారు ఆగ్రహించారు. తాను కన్నెర్ర జేస్తే... రక్తం కక్కుకుని చస్తారంటూ హెచ్చరించారు. అమ్మవారి ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానమిస్తూ.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా తాము దగ్గరుండి పూజలు చేయిస్తున్నామని తెలిపారు. ఇక నుంచి ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లు జరగనివ్వబోమని అమ్మవారిని వేడుకున్నారు. దీంతో అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత శాంతించారు.