Sneha Debnath: అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత యమునా నది ఒడ్డున విగత జీవిగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని

Delhi University Student Sneha Debnath Body Found on Yamuna River Bank
  • ఈ నెల 7న అదృశ్యమైన స్నేహా దేబ్‌నాథ్
  • సిగ్నేచర్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు సూసైడ్ నోట్
  • కొంత కాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నట్టు చెప్పిన స్నేహితులు
అదృశ్యమైన ఆరు రోజుల తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి స్నేహా దేబ్‌నాథ్ (19) నిన్న యమునా నది ఒడ్డున విగత జీవిగా కనిపించింది. త్రిపురకు చెందిన స్నేహ దక్షిణ ఢిల్లీలోని పర్యావరణ్ కాంప్లెక్స్‌లో నివసిస్తూ ఆత్మా రామ్ సనాతన ధర్మ కళాశాలలో బీఏ మ్యాథమెటిక్స్ చదువుతోంది. ఈ నెల 7న అదృశ్యమైంది. సిగ్నేచర్ బ్రిడ్జి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు ఒక సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. 

ఈ నెల 7న ఉదయం 5:15 గంటలకు స్నేహ తన దక్షిణ ఢిల్లీ నివాసం నుంచి ఒక క్యాబ్‌లో బయలుదేరింది. ఉదయం 8:45 గంటల సమయంలో తల్లిదండ్రులు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. స్నేహితురాలు పిటునియాను కలిసేందుకు సరాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళుతున్నట్టు అంతకుముందు ఆమె  తన తల్లికి చెప్పింది. కానీ ఆమె స్నేహితురాలు మాత్రం స్నేహ తన దగ్గరికి రాలేదని తెలిపింది.

ఈ సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) నిగమ్ బోధ్ ఘాట్ నుంచి నోయిడా వరకు యమునా నదిలో విస్తృతంగా గాలించారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం గీతా కాలనీ ఫ్లైఓవర్ సమీపంలో స్నేహ మృతదేహం నదిలో తేలుతూ కనిపించింది. ఇది సిగ్నేచర్ బ్రిడ్జి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

స్నేహ నివాసంలో పోలీసులు ఒక చేతితో రాసిన సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. అందులో సిగ్నేచర్ బ్రిడ్జి నుంచి దూకబోతున్నట్టుగా ఉంది. స్నేహ కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు ఆమె స్నేహితులు తెలిపారు. ఆ రోజు ఉదయం ఒక అమ్మాయి బ్రిడ్జిపై నిలబడి ఉన్నట్లు చూశామని, ఆ తర్వాత ఆమె అదృశ్యమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో అసలు విషయం బయటపడనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sneha Debnath
Delhi University
Yamuna River
Suicide
Missing student
Student death
Signature Bridge
NDRF
Student suicide
Sarai Rohilla Railway Station

More Telugu News