మలయాళం ప్రేక్షకులు సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటారు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథలను ఇష్టపడుతూ ఉంటారు. అందువల్లనే ఆ తరహా కథలు అక్కడి థియేటర్లకు వస్తూ ఉంటాయి. అలా వచ్చిన సినిమానే 'సంతోషం'. అజిత్ థామస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో ఫిబ్రవరి 24వ తేదీన విడుదలైంది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 11 నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: సురేశ్ కుమార్ (కళాభవన్ షా జోన్) ఓ మధ్య తరగతి కుటుంబీకుడు. భార్య సింధు (ఆశ అరవింద్) పెద్దకూతురు ఆద్య ( అనూ సితార) చిన్న కూతురు అక్షర ( లక్ష్మి) తల్లి లీల (మల్లిక సుకుమారన్) .. ఇదే అతని ఫ్యామిలీ. ఆద్య .. అక్షర అక్కాచెల్లెళ్లు .. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. అందువలన అక్షరకి కావాలసినవన్నీ ఆద్య చూసుకుంటూ ఉంటుంది. అక్షరను స్కూల్ కి  రెడీ చేసి పంపించి, తాను జాబ్ కి వెళుతూ ఉంటుంది. 

ఆద్యను గిరీశ్ (అమిత్) చూస్తాడు. అప్పటి నుంచి ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆద్యను రహస్యంగా ఫాలో అవుతూ ఉంటాడు. అయితే అతని గురించి ఆద్య ఎంతమాత్రం పట్టించుకోదు. తనని ఆద్య ముస్తాబు చేయడం .. తన అభిప్రాయాలను గురించి పట్టించుకోకుండా డ్రెస్ చేయడం అక్షరకి ఎంత మాత్రం నచ్చదు. ఆద్య కారణంగా తన స్వేచ్ఛ దెబ్బతింటుందనీ, సాధ్యమైనంత త్వరగా ఆద్య పెళ్లిచేసుకుని వెళ్లిపోతే బాగుంటుందని భావిస్తుంది. 

ఆద్యను గిరీశ్ ఇష్టపడుతున్నాడని గ్రహించిన అక్షర, ఆమె ఇష్టాఇష్టాలను గురించి అతనికి చెబుతుంది. అలా గిరీశ్ ప్రేమలో ఆద్య పడటానికి అక్షర ప్రధానమైన కారణమవుతుంది. గిరీశ్ ను పెళ్లి చేసుకోవాలని ఆద్య నిర్ణయించుకుంటుంది. ఆ విషయాన్ని పేరెంట్స్ తో చెబుతుంది. అప్పుడు వాళ్లు ఎలా స్పందిస్తారు? ఆ తరువాత అక్షరకి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ఎవరి జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: ఇది అక్కాచెల్లెళ్ల చుట్టూ తిరిగే ఒక చిన్న బడ్జెట్ చిత్రం. తన అక్కయ్య పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తన స్వేచ్ఛకి అడ్డు ఉండదని భావించిన ఒక చెల్లెలి కథ ఇది. సింపుల్ లైన్ తో రూపొందించిన ఈ సినిమా, సున్నితమైన భావోద్వేగాలను ప్రధానంగా చేసుకుని కొనసాగుతుంది. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్ ను పరిచయం చేస్తూనే, జనరేషన్ ను బట్టి స్వభావాలు ఎలా మారతాయనేది చూపించారు. 

దర్శకుడు అక్కా చెల్లెళ్ల ట్రాక్ పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. మిగతా పాత్రలను లైట్ గా మాత్రమే టచ్ చేశాడు. కథలో అనూహ్యమైన మలుపులకుగానీ .. ట్విస్టులకుగాని పెద్దగా అవకాశం ఇవ్వలేదు. సాధ్యమైనంత వరకూ సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వెళ్లాడు. అందువలన సాదాసీదాగానే ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా? అనే ఒక కుతూహలం కలిగించలేకపోతుంది.

ఇక ఈ కథ .. మొదలైన దగ్గర నిదానంగానే నడుస్తూ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ సమయానికి పుంజుకుంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందని భావిస్తారు. కానీ అలాంటిదేమీ లేకుండా, చాలా సాదాసీదాగానే ఈ కథకి ముగింపు కార్డు పడుతుంది. మలయాళం ప్రేక్షకుల స్థాయిలో మిగతా ఆడియన్స్ కి ఈ సినిమా సంతృప్తిని కలిగించలేకపోవచ్చు.  

పనితీరు: ఇది ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. బడ్జెట్ పరంగానే కాదు, కంటెంట్ పరంగా కూడా పెద్దగా బరువు లేని కథ. సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించిన విధానం బాగానే ఉంది. కాకపోతే ఒక సినిమా మాదిరిగా కాకుండా, సింగిల్ ఎపిసోడ్ లా అనిపిస్తుంది అంతే. అక్కా చెల్లెళ్లుగా చేసిన అనూ సితార - లక్ష్మి నటన ఆకట్టుకుంటుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. 

ముగింపు: ఎవరిపైనైనా ప్రేమతో ప్రత్యేక దృష్టి పెడితే, తమపై పెత్తనం చేస్తున్నారని అవతల వాళ్లు అనుకోవడం సహజం. కానీ అలాంటివారు దూరమైనప్పుడే వారి విలువ తెలుస్తుంది అనే ఒక సందేశంతో కూడిన కథ ఇది. కాకపోతే వినోదపరమైన అంశాలు పెద్దగా కనిపించవు అంతే.